ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

రవికుమార్‌ ఇంట్లో మద్యం సీసాలు పెట్టింది పోలీసులే

బెదిరించి ఏకగ్రీవాలు చేయిస్తున్న ఎమ్మెల్యే యరపతినేని

వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజం

రవికుమార్‌ కుటుంబానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌లో పరామర్శ

జైలు నుంచైనా పోటీ

దాచేపల్లి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పోలీసులే లిక్కర్‌ బాటిల్స్‌ పెట్టి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొప్పుల రవికుమార్‌ అక్రమ అరెస్ట్‌పై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. రవికుమార్‌ అక్రమ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌ ద్వారా రవికుమార్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం కాసు మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరించి ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. యరపతినేని, పోలీసుల బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పారు. అపార్ట్‌మెంట్‌ వద్ద కార్‌ పార్కింగ్‌ స్థలంలో పోలీసులే మద్యం సీసాలు పెట్టి అక్రమ కేసులో రవికుమార్‌ని ఇరికించారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేక ఇలా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని పాలకులపై ధ్వజమెత్తారు. తప్పు చేసిన పోలీసులపై కేసు పెడతామని, రవికుమార్‌ను అఖండ మెజారిటీతో చైర్మన్‌గా గెలిపించేలా ముందుకెళ్తామని చెప్పారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి అండగా ఉంటూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇంతటి దుర్మార్గమైన పాలనను తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. తాము పోటీ చేసి గెలిచేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు.

రవికుమార్‌పై అక్రమ కేసు

తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమనే ఉద్దేశంతో పోలీసులతో లిక్కర్‌ కేసు పెట్టించి అన్యాయంగా కేసులో ఇరికించారని రవికుమార్‌ తండ్రి సాంబయ్య చెప్పారు. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు నిర్బధించి, ఇల్లంతా సోదాలు చేశారని తెలిపారు. తమ కుటుంబ చరిత్ర జిల్లా మొత్తానికి తెలుసునని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. పట్టుదలతో పనిచేసి గెలుస్తామని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు శివారెడ్డి, మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్‌ సుభాని, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మందపాటి రమేష్‌రెడ్డి, బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ మునగా పున్నారావు, మాజీ ఎంపీపీ కందుల జాను, అధికార ప్రతినిధి షేక్‌ జాకీర్‌హుస్సేన్‌, నాయకులు గొగిరెడ్డి వెంకటరెడ్డి, కుందురు తిరుపతిరెడ్డి, కొలా జంపాలరెడ్డి, కొమరబత్తిన విజయ్‌కుమార్‌, షేక్‌ ఖాదర్‌ బాషా, తండా అబ్దుల్‌సత్తార్‌, దేవళ్ల వీరాస్వామి, ఆరికట్ల మల్లారెడ్డి, కర్పూరపు వెంకటకోటయ్య, మందపాటి వీరారెడ్డి, కూసం నాగిరెడ్డి, సంకురాత్రి వీరయ్య, మునగా శ్రీనివాసరావు, దాచేపల్లి సైదారావు, ముడి విక్టర్‌పాల్‌ తదితరులున్నారు.

కొప్పుల రవికుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని, ఆయన జైలు నుంచైనా పోటీ చేస్తారని నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి అన్నారు. రవికుమార్‌ హక్కుని పోలీసులు కాలరాశారని, తప్పుడు కేసులో ఇరికించటం దారుణమని చెప్పారు. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని నిలదీశారు. ఎన్ని కేసులు పెట్టి నిర్భందించినా తామే విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలు భయపడవద్దని, బాధ్యులైన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement