బరితెగించిన టీడీపీ నేతలు అర్ధరాత్రి ఇంటికి వెళ్లి వైఎస్సార్ సీపీ నేత కిడ్నాప్నకు యత్నం అడ్డువచ్చిన ఆయన భార్యపైనా దాడి పలుచోట్ల తిప్పుతూ భౌతికదాడి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు ‘పచ్చ’మూకలు సిద్ధమయ్యాయి. నామినేషన్ల పర్వం తొలిరోజే పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతికదాడులకూ పాల్పడ్డారు. దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కల్పించారు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్ అరెస్టు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మరోవైపు పిడుగురాళ్ల, గురజాల నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు భారీగా మోహరించి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. పెదకూరపాడు మండలం గారపాడులో వైఎస్సార్ సీపీ నాయకుడిని అర్ధరాత్రి కిడ్నాప్ చేసేందుకు యత్నించి, అడ్డువచ్చిన ఆయన భార్యపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చగా మారింది. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకుని వక్రమార్గంలో గెలవడానికి పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీనికోసం పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు.
గారపాడులో కిడ్నాప్ కలకలం
పెదకూరపాడు: మండల పరిధిలోని గారపాడు గ్రామంలో అర్ధరాత్రి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మువ్వా హరిబాబు వైఎస్సార్ సీపీలో కీలక నేతగా ఉన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు బీసీలకు రిజర్వ్ చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎవ్వరూ బరిలో నిలవకుండా టీడీపీ నాయకులు, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు మక్కెన సాగర్ ఆధ్వర్యంలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. హరిబాబును గురువారం అర్ధరాత్రి 11:30 గంటలకు ఇంట్లో నిద్రిస్తుండగా టీడీపీ నాయకులు లోనికి చొరబడి కిడ్నాప్నకు యత్నించారు. హరిబాబు సతీమణి సుధారాణి అడ్డుకునే క్రమంలో ఆమైపె తీవ్రంగా దాడి చేశారు. హరిబాబును కారులో ఎక్కించుకొని తీవ్ర పదజాలంతో తిడుతూ ఎన్నికల బరిలో దిగితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అచ్చంపేట మండలం కస్తాల ఇసుక రీచ్ వద్దకు తీసుకువెళ్లి దాడి చేశారు. అక్కడ ఉన్న నీటి సంపులో పడేసి చంపుతామని బెదిరించారు. అక్కడి నుంచి తిరిగి పెదకూరపాడు వైపు వస్తుండగా అప్పటికే బాధిత కుటుంబసభ్యులు 100కు కాల్ చేశారు. పెదకూరపాడు ఎస్ఐ సుధారాణికి అందిన సమాచారం మేరకు వెంటనే స్పందించారు. బుచ్చయ్యపాలెం నాలుగు డొంకల వద్ద కారు ఎదురవ్వటంతో పెదకూరపాడు స్టేషన్కు తరలించారు.


