ప్రజలకు టీడీపీ సర్కార్
వెన్నుపోటు
క్రీడాకోటాలో అనర్హులకు ఉద్యోగాలు
యువతను
మోసగిస్తున్న
ప్రభుత్వం
డీఎస్సీ అక్రమాలపై
జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతి రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో రూ.15 లక్షల లంచం తీసుకొని ఉద్యోగాలు అమ్ముకొని ప్రజలను మోసం చేసి బహిరంగ చర్చకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రమ్మని లోకేష్ అడగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ చర్చకు జగన్‌మోహన్‌రెడ్డి అవసరం లేదని, తామే వస్తామని, లోకేష్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీలో అవకతవకలపై లోకేష్ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమేనని, ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 26 వేలే మాత్రమేనని కేంద్రం సమాధానమిచ్చిందని గుర్తుచేశారు. మీరు చెబుతున్నట్లుగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యార్థులకు కేవలం ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రమే ఇచ్చారని, అసెంబ్లీలో రూ.వేయి కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారని, తమ పార్టీ ధర్నా అనగానే రూ.600 కోట్లు రిలీజ్ చేశామని ప్రకటన చేశారే కానీ ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. ఈ ప్రభుత్వం యువతను, విద్యార్థులను పచ్చిగా మోసం చేస్తోందన్నారు. తల్లికి వందనం పథకంలో అర్హులైన విద్యార్థులు 84 లక్షల మంది ఉంటే కేవలం 64 లక్షల మందికే నగదు ఇచ్చారన్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనే కారణంతోనే నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.
నరసరావుపేట: డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, డీఎస్సీ అక్రమాలపై పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పార్టీ విద్యార్థి, యువత విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీ, ప్రదర్శనలో యువజనులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది యువత, విద్యార్థులతో కలిసి ద్విచక్రవాహనాల ర్యాలీగా డాక్టర్ గోపిరెడ్డి, నంబూరు శంకరరావులు కలెక్టరేట్ రోడ్డులోని వైఎస్సార్ రహదారి వద్దకు చేరారు. అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడకు చేరుకున్న పార్టీ పీఏసీ మెంబర్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి ముందుకు సాగారు. డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని బ్యానర్‌తో వందలాది మంది యువత వెంటరాగా కాలినడకన నిరసన ప్రదర్శనగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్దకు చేరారు.
లోకేష్ రాజీనామా చేయాలని, ‘‘ఇదేమి రాజ్యం – దోపిడీ రాజ్యం – దొంగల రాజ్యం’’, ‘‘డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం’’, ‘‘ మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’’ అంటూ నినాదాలు చేశారు. ‘డీఎస్సీలో స్కామ్ చేయకపోతే సీబీఐ విచారణకు భయమెందుకు?’’, ‘‘నేతల చేతిలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, అర్హులైన క్రీడాకారులకు కన్నీళ్లు’’ ‘‘పరీక్ష రాయకుండానే బాబు జమానాలో ఉద్యోగాలు’’, ‘‘రాత్రింబవళ్లు చదివిన వారు రోడ్డుపై, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా?’’, ‘‘నిరుద్యోగ భృతి ఎప్పుడు?’’, ‘‘ఉద్యోగులకే కాదు నిరుద్యోగులకూ వెన్నుపోటు’’ అంటూ ప్లకార్డులు దారిపొడవునా ప్రదర్శించారు. పార్టీ జెండాలు చేబూని పార్టీ నాయకులు, యువత ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి, గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, రొంపిచర్ల, నరసరావుపేట మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, మోరబోయిన శ్రీనివాసరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పతాళ్ల వేణుమాధవ్, యువజన విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగ కార్యదర్శి హెల్డా ప్లోరెన్స్, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ టి. మంగమ్మ, మాజీ కౌన్సిలర్ బత్తుల లక్ష్మీపద్మలత, బొగ్గరం మూర్తి, పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేదలకు విద్య దూరం
విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను మంత్రి లోకేష్ తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఈ విధంగా ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదన్నారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదన్నారు. పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన లోకేష్ వెంటనే తన మంత్రి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఢిల్లీని తాకే విధంగా నిరసన చేపడతామని హెచ్చరించారు.
విద్యావ్యవస్థ నాశనం
యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటపు ప్రచారం చేసి అనేక అవకతవకలకు పాల్పడ్డారన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్న 400 ఉద్యోగాలను అర్హతలేని తమ అనుచరులకు మంత్రి ఇచ్చారన్నారు. విద్యావ్యవస్థను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెరుగు పరిస్తే, కూటమి ప్రభుత్వంలో ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించటంలో ఉన్న ఆసక్తి పేద విద్యార్థులు, యువతకు న్యాయం చేయటంలో లేదని ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కూటమి నాయకులు వెన్నుపోటు పొడవటంలో ఘనులని అన్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల అమలులో ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రతి మహిళకు రూ.15 వేలు అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్‌బీకేలు తాము నిర్మిస్తే వాటికి వారు బోర్డులు పెట్టుకోవడం వెన్నుపోటేనన్నారు. పేద, మధ్యతరగతి వర్గీయులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వారి రక్తం తాగుతున్నారని తెలిపారు. ప్రతి దానిలో లంచాలు డిమాండ్ చేస్తూ కూటమి నాయకులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ఒకేసారి 1.35 లక్షల సచివాలయ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపట్టారన్నారు. కేవలం 16 వేల మెగా డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వటానికి లోకేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. యువగళంలో తనతో తిరిగిన వారికి స్పోర్ట్స్ కోటాలో మంత్రి లోకేష్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇది దారుణమని పేర్కొన్నారు. చదువుకున్న విద్యార్థులు, మెరిట్ కలిగిన వారు ఏమైపోతారని ప్రశ్నించారు. దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


