నకరికల్లు: పాఠశాల గోడ దూకి విద్యార్థినులు పారిపోయిన సంఘటన పల్నాడు జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. సకాలంలో స్పందించిన పోలీస్ అధికారులు ఆధునిక టెక్నాలజీ ద్వారా విద్యార్థినుల ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చడంతో ఉత్కంఠకు తెరపడింది. వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థిని, ఆరోతరగతి విద్యార్థిని కలిసి మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాల గోడదూకి పారిపోయారు. కొద్దిసేపటికే గమనించిన ప్రిన్సిపల్ జి.జ్యోత్స్నదీప్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. క్షేమంగా పిల్లలను తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ ఆధ్వర్యంలో నకరికల్లు ఎస్‌ఐ కె.సతీష్‌తోపాటు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. పోలీస్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థినులు ఎటు వెళ్లారు, ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని సేకరించారు. చిలకలూరిపేట పట్టణంలో ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో వారి ఆచూకీని స్పష్టంగా గుర్తించారు. వెంటనే సిబ్బందితో బయలుదేరారు. విద్యార్థినులకు నచ్చజెప్పి వారిని వెంట తీసుకొని నకరికల్లు చేరుకున్నారు. తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుపై ఆసక్తి తగ్గడంతో ఇలా చేశారని గుర్తించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్యాంప్రసాద్, ఎస్‌ఐ కె.సతీష్, ప్రిన్సిపల్‌లు విద్యార్థినులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. గంటల వ్యవధిలోనే విద్యార్థినుల ఆచూకీ కనుకొని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఎస్‌ఐ కె.సతీష్‌ను, సిబ్బందిని రూరల్ సీఐ పి.కిరణ్ అభినందించారు.


