పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ట్రస్ట్ నిర్వాహకులు
నరసరావుపేట: చేతులు లేని దివ్యాంగులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేయూత అందజేయటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఆగస్టు 6, 7వ తేదీల్లో నరసరావుపేటలోని రాధా సుందర్ కల్యాణమండపంలో నిర్వహించే కృత్రిమ చేతుల పంపిణీలో అవసరమైన వారు పాల్గొని చేతులు పొందాలని సూచించారు. ఈ మేరకు కార్యాలయంలోని తన చాంబర్‌లో నిర్వాహకులతో కలిసి మంగళవారం పోస్టర్ ఆవిష్కరించారు. లక్షల ఖరీదుతో బ్యాటరీతో నడిచే ఆధునాతన కృతిమ చేతులను సుమారు 200 మందికి నరసరావుపేట ప్రాణదానం ట్రస్ట్ నిర్వాహకులు రావిపాటి శ్రీనివాస్( కిరణ్ ) ఉచితంగా అందచేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు. విద్యుత్ షాకులు, రహదారి ప్రమాదాలు, కర్మాగారాలలో సంభవించే ప్రమాదాలలో చేతులు కోల్పోయిన బాధితులకు వీటి అవసరం చాలా ఉంటుందన్నారు. ప్రాణదానం ట్రస్ట్ గౌరవ సలహాదారులు కేపీ రంగారావు మాట్లాడుతూ చేతులు కోల్పోయి తమ జీవన మనుగడ కష్టంగా ఉన్నవారికి ఈ కృత్రిమ చేతుల అమరిక ద్వారా వారి జీవితాలలో నూతన వెలుగులు ఇచ్చినవారమవుతామన్నారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అవసరమైనవారు ఉచితంగా చేతులు పొందేందుకు 70134 63637 నెంబరులో సంప్రదించాలని కోరారు.
వినుకొండ: మద్యం వ్యసనానికి బానిసైన ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి (అత్త) సీతారావమ్మ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వంకాయలపాటి కోటయ్య నిత్యం మద్యం తాగి భార్య, పిల్లలను వేధించేవాడు. ఇటీవల ప్రభుత్వం నుంచి పిల్లల చదువుల కోసం భార్య ఖాతాలో జమ అయిన ‘తల్లికి వందనం’ నగదును దొంగిలించి మద్యానికి తగలేశాడు. ఈ విషయమై భార్య నిలదీయడంతో ఆమైపె కత్తితో దాడికి యత్నించాడు. అంతేకాకుండా మంగళవారం ఉదయం మద్యం కోసం ఇంట్లోని వాటర్ మోటార్‌ను అమ్ముకుని తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన కోటయ్య ప్రస్తుతం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


