● టేబుల్ టెన్నిస్‌లో స్ఫూర్తి నైనా ప్రతిభ
● స్టేట్ ర్యాంకింగ్స్‌లో వరుసగా
తొమ్మిదిసార్లు నంబర్‌వన్
● జాతీయస్థాయి పోటీల్లో
పాల్గొనేందుకు పేదరికం అడ్డంకి
● తండ్రి ప్రైవేటు స్కూల్లో పీఈటీ
● దాతలు స్పాన్సర్ చేస్తే జాతీయస్థాయిలో సత్తా చాటుతానంటున్న స్ఫూర్తి
కారెంపూడి: జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని కారెంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన గిరిజన బాలిక చదల స్ఫూర్తి నైనా కలలు కంటోంది. అయితే ఆ చిన్నారి కలల సాకారానికి పేదరికం అడ్డువస్తోంది. ఇప్పటి వరకు 15 ఏళ్ల లోపు విభాగాలలో వరుసగా తొమ్మిది సార్లు స్టేట్ ర్యాంకింగుల్లో నంబర్ వన్ స్థానంలో ఆమె కొనసాగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ క్రీడలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అవసరమయ్యే శిక్షణకు క్రీడా సామగ్రికి ఇతర ఖర్చులు ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. పాప తాత ఏడుకొండలు ఆటో డ్రైవర్. తండ్రి ప్రైవేటు స్కూల్లో పీఈటీ. వీరి సంపాదన కుటుంబాల పోషణకే అంతంతమాత్రంగా ఉన్నాయి. కుమార్తెకు మెరుగైన శిక్షణ ఇప్పించడానికి తండ్రి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. తల్లి అనిత, తండ్రి ఏసుబాబుకు టేబుల్ టెన్నిస్‌లో ప్రవేశం ఉండడంతో వారే శిక్షణ ఇస్తూ కుమార్తెను ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఇక జాతీయ పోటీలకు వెళ్లాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే కష్టమని మకాంను ఏసుబాబు హైదరాబాదుకు మార్చారు. అక్కడే మదీనాగూడలోని జనసిస్ స్కూల్లో 8వ తరగతిలో స్ఫూర్తి నైనాను చేర్చి తను కూడా ప్రైవేటు స్కూల్లో పీఈటీగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వచ్చే జీతంతో కుటుంబం గడవడం, శిక్షణ ఇప్పించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే మరో వైపు జాతీయ పోటీలకు స్ఫూర్తి నైనా సిద్ధం అవుతోంది.
తొమ్మిదిసార్లు ఫస్ట్ ర్యాంక్
వరుసగా తొమ్మిది సార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పటికే 2023లో 11 ఏళ్ల లోపు విభాగంలో జాతీయస్థాయిలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరి రాణించింది. తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ 2025లో బంగారు పతకాన్ని స్ఫూర్తి సాధించింది. అంతకుముందు మన రాష్ట్రంలో 2023 నుంచి 2024 వరకు జరిగిన 9వ రాష్ట్రస్థాయి పోటీల్లో తొమ్మిదిసార్లు కూడా ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచి సత్తాచాటింది.


