తమ కడుపు కొట్టవద్దంటున్న దస్తావేజు లేఖరులు జిల్లాలో ఈ నెల 20 నుంచి కొనసాగుతున్న పెన్‌డౌన్ రూ. 36 కోటక్లు పైగా ఆదాయానికి గండి ప్రైవేట్ ఏజెన్సీల పెత్తనంపై ఆందోళన
రోడ్డున పడేయొద్దు
1200 కుటుంబాలకు దిక్కేదీ?
జీవో నంబర్ 396పై ఆగ్రహావేశాలు
దస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టే జీవో 396 ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. ఆర్‌ఎస్‌కేలతో ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాం.
– పోతంశెట్టి వెంకటేష్, అధ్యక్షుడు,
దస్తావేజు లేఖర్ల సంఘం, సత్తెనపల్లి
సత్తెనపల్లి: రిజిస్ట్రేషన్ అంటే ఒక వేడుకే. కొనేవాళ్లకు ఆస్తి వస్తుందనే సంతోషం.. అమ్ముకొనే వాళ్లకు డబ్బు వస్తుందనే ఆనందం. అయితే ఈ ప్రక్రియ సంక్షిష్టంతో ఉంటుంది. ఇప్పటి వరకు దస్తావేజు లేఖర్లు ప్రతి అంశాన్ని పరిశీలించి ఎలాంటి తప్పొప్పులు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్ చేయించి ఆస్తి పత్రాలు చేతులకు అందించేవారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఈ పని అప్పగిస్తూ జీఓ నంబర్ 396 విడుదల చేసి ఆ దిశగా సన్నాహాలు మొదలు పట్టింది. ఇది ఎలాంటి ముసలం తెస్తుందోననే ఆందోళన అన్ని వర్గాల్లో నెలకొంది.
10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ప్రమాదం
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఇప్పుడు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రూ. 2 వేలు రుసుము చెల్లిస్తే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతుందని చెబుతోంది. అయితే రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారు ఎంత పరపతి ఉన్నవారైనా ఒక పూటంతా సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేస్తామన్న కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదని క్రయ విక్రయదారులు చెబుతున్నారు. పోనీ ఈ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పరం చేసినా లబ్ధిదారులకు ఉపయోగం ఉండేది. కానీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి కమీషన్ కొట్టేసి, తద్వారా డబ్బులు సంపాదించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వందేళ్లకు పైగా ఉన్న వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్న కూటమి పాలకుల ఆలోచనలను విరమించుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు ఈ నెల 6,7 తేదీల్లో ఆందోళనలు, శాంతియుత నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ఉండడంతో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్‌డౌన్ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
జిల్లాలో రూ.36 కోట్ల ఆదాయానికి గండి
నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల, క్రోసూరు, అమరావతి లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నిత్యం ప్రభుత్వానికి రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు లేఖర్ల సహాయకులు పెన్‌డౌన్ నిరసన చేపట్టడంతో రూ.30 కోట్ల పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ నెల 6,7న నిరసనలతో రూ. 6 కోట్లు ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది.
న్యాయపరమైన చిక్కులు తప్పవు
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో తీసుకొస్తామని ప్రకటించినట్లుగా కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో పీపీపీ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయాలను పాస్‌పోర్టు కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఈ విధానం ప్రకారం క్రయ, విక్రయదారులు ఇద్దరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు (ఆర్‌ఎస్‌కేకి) వెళ్లి వారి దస్తావేజులు తయారు చేసుకొని, సబ్‌రిజిస్ట్రార్ దగ్గరకు వెళితే ఆయన పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఈ విధానం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకానున్నాయని దస్తావేజు లేఖర్లు అంటున్నారు. క్రయ, విక్రయదారుల్లో ఎవరికై నా రిజిస్ట్రేషన్ విధానంపై సరైన అవగాహన లేకపోయినా, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వందేళ్ల చరిత్ర ఉన్న దస్తావేజు లేఖర్ల బతుకులు రోడ్డున పడేయడం సరికాదు. జీవో 396 అమలు చేస్తే కుటుంబాలను పోషించుకునేందుకు దస్తావేజు లేఖరులు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చు కోవాలి.
– డోగిపర్తి శివకేశవ, ట్రెజరర్,
దస్తావేజు లేఖర్ల సంఘం, సత్తెనపల్లి
జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లు 300 మంది, స్టాంప్‌వెండర్లు 100 మంది, డీటీపీ ఆపరేటర్లు 200 మంది, దస్తావేజు లేఖర్ల సహాయకులు 600 మందికి పైగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మంది ఉన్నారు. పరోక్షంగా వీరిపై వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక్కో దస్తావేజు లేఖరు వద్ద ఐదు కుటుంబాలు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 396 జీఓ తీసుకురావడం వలన ప్రత్యక్షంగా 1200 కుటుంబాలు, పరోక్షంగా మరో 200 కుటుంబాలకు పైగా రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి యువత పెడదారి పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 396 జీవోను ప్రభుత్వం తీసుకు రావడంతో మొత్తం మీద జిల్లాలో రూ. 36 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిన పరిస్థితి నెలకొంది.


