నరసరావుపేట: ఆవులకు రాష్ట్ర మాత లేదా అంతర్జాతీయ ఆరాధ్య దేవత అనే రాజ్యాంగ హోదాను కల్పించి జాతీయ గౌరవం ఇవ్వాలని గో సన్మాన్ ఆహ్వాన్ అబియాన్ ప్రతినిధులైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధారమణదాస్ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. గో వధను నిషేధించాలని, గోశాలలకు ప్రభుత్వ బడ్జెట్ కేటాయించి వాటిని పెంచి పోషించాలని కోరారు. నరసరావుపేట, చిలకలూరిపేట గోశాల ప్రతినిధులు శివనాగేశ్వరరావు, కృష్ణచంద్ర, ప్రతినిధులు పాల్గొన్నారు.
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభి షేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆలయ అర్చకులు, వేదపండితులచే విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మట్టి కుండలతో మల్లేశ్వరస్వామి వారికి మహన్యాసపూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, సభ్యులు బండారు మల్లేశ్వరి దంపతులు, భైరపనేని ధనలక్ష్మీ దంపతులు, ఉల్లం రాజేశ్వరి దంపతులు, ధూపాటి శివశంకరరావు, కొమ్మూరి మల్లిఖార్జునరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు.
అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువులను పూజించాలని భవఘ్నిగురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపుర భవఘ్ని అరామంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో తొలిరోజు సోమవారం కార్యక్రమాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈసందర్భంగా భవఘ్ని గురూజీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద భారతదేశం సొంతమన్నారు. ఋషులు, మునులు మనకు అందించిన మహోన్నతమైన జ్ఞాన సంపదను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో బోధించే గురువులను స్మరించుకోవటం అదృష్టంగా భావించాలన్నారు. తొలుత వేకువజామున వ్యాసభగవానులకు సుప్రభాతసేవ, వ్యాసభగవానుడి ఉత్సవమూర్తికి రథోత్సవం, అనంతరం ఆదిగురువు వ్యాసభగవానునికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈవేడుకలలో పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులందరికీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాట్లను పరవ్యవేక్షించారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక విద్యానగర్ శ్రీసాయినాధ సన్నిధానంలో నిర్వహిస్తోన్న గురుపూర్ణిమ మహోత్సవాలు సోమవారం ఐదో రోజుకి చేరాయి. సాయినాధునికి శ్రద్ధాసక్తులతో రుద్రాభిషేకం నిర్వహించారు. మహిళలు హాజరవ్వగా, సాప్తాహిక అఖండ సాయినామ సంకీర్తన కొనసాగించారు. ఆలయ గౌరవాధ్యక్షుడు యడ్లపాటి అశోక్‌కుమార్, అధ్యక్షుడు వడ్లమూడి శివ రామకృష్ణయ్య, స్వరూపరాణి, సంజీవరావు, అప్పారావు పాల్గొన్నారు.


