విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలతో పాటు, రెండేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ విద్యార్థులు, యువతను, ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నర్సరావుపేటలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో రూ.లక్షలు తీసుకుని అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్పడ్డారన్నారు. ఈకారణంగా అర్హులైన ఎంతో మంది యువత ఉద్యోగాలు రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో డీఎస్సీ అవకతవకలపై నారా లోకేష్ సైతం రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ అవకతవకలపై కేంద్రం స్పందించి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేళ్లయినా దాని గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు అని చెప్పి, నేడు మొండిచేయి చూపించారన్నారు. వీటన్నిటికి నిరసనగా నర్సరావుపేటలో జరిగే ర్యాలీలో యువత, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.


