వీధికెక్కిన మాఫియా ఆధిపత్య పోరు ఒక వర్గంపై మరో వర్గం దాడులు జీరో బిల్లుల దందా దక్కించుకునేందుకు వర్గపోరు గ్రానైట్ మాఫియా తనదేనంటున్న ఓ మంత్రి అనుచరుడు పిడుగురాళ్లకు వచ్చి సినీ ఫక్కీలో సవాళ్లు
సాక్షి, నరసరావుపేట: అక్రమ గ్రానైట్ దందాపై ఆధిపత్య పోరు పల్నాడు జిల్లాలో వీధికెక్కింది. గ్యాంగ్ వార్ తరహాలో రొడ్డుకెక్కి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. గ్రానైట్ మాఫియా పోరు సవాళ్ల స్థాయి దాటి భౌతికదాడులకు చేరింది. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ అక్రమ రవాణాపై అధిపత్యం కోసం పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు గ్రూప్‌లు పోటీపడ్డాయి. పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గత కొంతకాలంగా గ్రానైట్ అక్రమ రవాణాలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. దీనిపై పల్నాడు జిల్లా అధికారపార్టీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. వీరి పోరు నేపథ్యంలో గ్రానైట్ యజమానులే ఇటీవల నేరుగా రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. తమ ఆదాయ మార్గాలు దెబ్బతినడంతో ప్రకాశం జిల్లా గ్యాంగ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరదీశారు.
ఆయన సారధ్యంలోనే...
గ్రానైట్ అక్రమ రవాణా దందా పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేసే వ్యక్తి సారధ్యంలోనే జరుగుతుందని సమాచారం. అయితే అక్రమ బిల్లులతో సరిహద్దులు దాటిస్తామని చెప్పి పెద్దమొత్తంలో వసూళ్లు చేస్తున్న ఈ గ్యాంగ్ అధికారులు పట్టుకుంటే తమకు సంబంధం లేదని చేతులెత్తుస్తున్నారట. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందిన మరో గ్యాంగ్ గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో కొత్త గ్యాంగ్ పంపుతున్న అక్రమ గ్రానైట్ వాహనాల వివరాలను తెలంగాణ జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టుకునేలా చేశారని సమాచారం. ఈ సమాచారం అందించిన వ్యక్తులపై దాడులు సైతం చేశారు. ఈ క్రమంలో గత వారం ప్రకాశం జిల్లాకు చెందిన అక్రమ రవాణా మాఫియాకు చెందిన వ్యక్తి పిడుగురాళ్లకు వచ్చి సినీ ఫక్కీలో సెల్పీలు తీసుకొని సవాళ్లు విసిరాడు. తిరుగుమార్గంలో బొప్పూడి వద్ద సదరు వ్యక్తిని ప్రత్యర్థులు పట్టుకొని తీవ్రంగా దేహశుద్ధి చేయడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీనిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిని పరామర్శించేందుకు వచ్చిన పిడుగురాళ్లకు చెందిన కారుపై ప్రకాశం జిల్లా గ్యాంగ్ ప్రతికారదాడి చేసి ధ్వంసం చేశారు. గ్రానైట్ ఆధిపత్య దాడులు హత్యల వరకు దారి తీస్తాయోమోనన్న ఆందోళనలు గ్రానైట్ పరిశ్రమ వర్గాల్లో నెలకొంది.


