యంత్రాంగం
దృష్టికి
80
ఘటనలు
జిల్లాలో గుట్టుగా బాల్య వివాహాలు
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు గుట్టుగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని అధికారుల దృష్టికి వస్తుండగా, చాలా వరకు రావడం లేదు. కొన్నిచోట్ల బాల్యవివాహాలు అధికారులు నిలుపుదల చేసినట్టు లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటున్నప్పటికీ రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి వివాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలు నిలుపుదల చేస్తున్నామని ఇరువురి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత అధికారులు అక్కడితో ఆ అంశాన్ని వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఆ వివాహానికి సంబంధించి ఎటువంటి ఆరా తీయడం లేదు. లిఖితపూర్వకంగా బాల్యవివాహం చేయబోమని రాసి ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు వారికి నిజంగానే బాల్యవివాహాన్ని నిలుపుదల చేశారా, లేదంటే అధికారులు వెళ్లిపోవడానికి ఆ విధంగా హామీ ఇస్తున్నారా .. అనేది అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ దాన్ని నిలుపుదల చేయడానికి వెళ్లిన అధికారులపై వదిలేయండని ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫలితమివ్వని సదస్సులు...
బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహ్ ముక్త్ భారత్, బేటీ బచావో.. బేటీ పడావో, కిశోరి వికాసం, ప్రత్యేక వాహన ప్రచారం సహా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. మండల సమాఖ్య, ఆరోగ్య సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధులు, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్‌ల వంటి దైవ సేవకులు, షామియానాలు వేసేవారు, ఫొటోగ్రాఫర్లు, భజంత్రీలు వాయించే వారితోపాటు ప్రతి విభాగం వారికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రణాళిక ప్రకారం జరగకపోవడం... ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపడం, ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడం వంటి కారణాలతో ఈ కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఆయా శాఖల సిబ్బంది నుంచే ఈ మాట వినిపిస్తోంది.
కమిటీలు ఉన్నా ఫలితం సున్నా
బాల్యవివాహాల నియంత్రణలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు మించిన బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ప్రాహిబిషన్ ఆఫీసర్లపై (సీఎంపీఓ) ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ)–2006 ప్రకారం, 31,39 జీఓలను అనుసరించి వివిధ స్థాయిల్లో కమిటీలను నియమించారు. జిల్లా ఉన్నతాధికారి సహా డీఆర్‌ఓ ఆధ్వర్యాన జిల్లా స్థాయి .. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్లలో ఆర్‌డీఓల ఆధ్వర్యాన డివిజన్ స్థాయి ... రెండు లేదా మూడు మండలాలకు ఒక బ్లాక్ చొప్పున సీడీపీఓల ఆధ్వర్యాన బ్లాక్ స్థాయి .. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, జీఎంఎస్‌కేలు, సీఎంపీఓల ఆధ్వర్యాన మండల స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా జీఎంఎస్‌కే నోడల్ అధికారిగా, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, మహిళా కార్యదర్శి, స్కూల్ హెచ్‌ఎం, అంగన్‌వాడీ వర్కర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఇలా 10 మందితో కలిపి ప్రతి గ్రామంలోనూ ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ కూడా వేశారు. బాల్యవివాహాల నియంత్రణ, నిరోధం కోసం వీటిని ఏర్పాటు చేశారు. పీసీఎంఏ చట్టాన్ని క్షేత్రస్థాయికి చేర్చి, బాల్యవివాహల నియంత్రణలో సీఎంపీఓలు కీలకపాత్ర పోషించాలి. పూర్తిగా నిరోధించాలి. ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నాయనేది ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. ఇవే కనుక సక్రమంగా పనిచేస్తే చిన్నారులకు ఈ దుస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
పుస్తకాలు చేతపట్టాల్సిన అభం శుభం తెలియని పసి మొగ్గలు మెడలో పసుపు తాడుతో మరొకరి వెంట నడుస్తున్నారు. చిన్న ప్రాయంలోనే పురిటి నొప్పులు పడుతున్నారు. సామాజిక దురాగతాలు, పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లోపం, అఘాయిత్యాల పేరిట వారి బాల్యం నాశనం అవుతోంది. బంగారు భవిష్యత్తు మసకబారుతోంది. రక్షించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చట్టం ఉన్నా అమలు తీరును ఎగ‘తాళి’ చేసింది. వందల మంది బాలికల జీవితాలు బుగ్గిపాలవడం ఆవేదన
కలిగిస్తోంది.


