షేక్‌ షబీనాకు స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌ | - | Sakshi
Sakshi News home page

షేక్‌ షబీనాకు స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

షేక్‌ షబీనాకు స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌ జనాభా పరిశోధన సంస్థ బృందం సందర్శన 24న జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం

తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్‌ లిఫ్టర్‌ షేక్‌ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సబ్‌–జూనియర్‌, జూనియర్‌, మాస్టర్స్‌ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో షబీనా జూనియర్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జూనియర్స్‌లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్‌ షబీనా స్క్వాట్‌లో 200 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 110 కిలోలు, డెడ్‌ లిఫ్ట్‌లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్‌గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్‌ స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ ఎం.అశోక్‌కుమార్‌ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు.

గుంటూరు మెడికల్‌: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్‌పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్‌ చేయడం, ఫాలో అప్‌ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్‌ని, ఎన్‌ఆర్‌సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ డాక్టర్‌ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్‌బీఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, మేనేజర్‌ శిరీష పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్‌బాల్‌ క్లబ్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, రెన్యువల్‌ పత్రాలు తీసుకురావాలని కోరారు.

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్‌బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement