చేతికందినా కన్నీరే.. | - | Sakshi
Sakshi News home page

చేతికందినా కన్నీరే..

Feb 27 2026 11:00 AM | Updated on Feb 27 2026 11:00 AM

చేతికందినా కన్నీరే..

చేతికందినా కన్నీరే..

చేతికందినా కన్నీరే.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు విక్రయించాక కేంద్రాల ఏర్పాటా? రైతుల నుంచి కొనుగోలు చేస్తాం

కంది పంట విక్రయానికి ఇబ్బంది పడుతున్న రైతులు జిల్లాలో 35 వేలకుపైగా హెక్టార్లలో పంట సాగు 80 వేల మెట్రిక్‌ టన్నుల దిగుమతి వస్తుందని అంచనా మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటా రూ.8 వేలకు కొంటానని ప్రభుత్వం ప్రకటన ఆచరణలో మాత్రం దారుణంగా విఫలం సిండికేట్‌గా మారిన దాల్‌ మిల్లర్లు, దోచుకుంటున్న దళారులు చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు

సాక్షి, నరసరావుపేట, దుర్గి: వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 35 వేల హెక్టార్లలో కంది సాగు చేశారు. సుమారు 80 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దిగుబడి ఎక్కువే ఉండే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 8 వేల మేరకు ప్రతి రైతు నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పటివరకు కనీసం ఒక్క మెట్రిక్‌ టన్నుల కందులను సైతం కొనుగోలు చేయలేదు. ఈ విషయంపై మార్క్‌ఫెడ్‌ అధికారులను అడిగితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన రైతుల నుంచి కందులు కొనుగోలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35 కేంద్రాలు ప్రారంభించారు. మరోవైపు తేమశాతం పేరిట అడ్డంకులు సష్టిస్తోంది. యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటివరకు 400 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పారు.

దళారుల దోపిడీ...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా కందులు రూ. 10 వేలకుపైగా ధర పలికింది. కొంత మంది రైతులు రూ.12 వేలకు సైతం అమ్ముకున్నారు. దీంతో రెండేళ్లుగా కంది పంట సాగుకు రైతులు ఉత్సాహం చూపారు. ప్రభుత్వం కందుల కొనుగోలులో విఫలమవడంతో రైతులు తప్పనిసరిగా ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమయ్యాయన్న పేరుతో క్వింటా కందులను రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అది కూడా రైతులే నేరుగా దాల్‌ మిల్లుల వద్దకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. వ్యాపారులు ఇంతలా దోపిడీకి రంగం సిద్ధం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కందిపంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండిన పంటను మార్క్‌ఫెడ్‌ కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారు. దీంతో రైతు కంట కన్నీరు వస్తోంది. ఆరుగాలం కష్టపడినా చంద్రబాబు సర్కారు తీరుతో నష్టాలు రావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ఆరు ఎకరాలలో కంది సాగు చేశా, దిగుబడి ఆశాజనకంగా లేదు. కనీసం పండించిన కందులను అమ్ముకుందామంటే కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక కష్టాల్లో ఊబిలో ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించిన కనీసం ధర రూ.8 వేలకు కొనుగోలు చేస్తామని కల్లుబొల్లి మాటలు చెప్పారు. నేటికీ ఆయా కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దళారులు, వ్యాపారుల చేతిలోకి దాదాపుగా కంది పంట వెళ్లిపోయింది.

– అంబారావు, రైతు, ఆత్మకూరు, దుర్గి మండలం

మూడు ఎకరాలలో కంది సాగు చేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే మద్దతు ధర రూ.8 వేలు వస్తుందని ఎంతో ఆశగా కోత ప్రారంభించాం. వచ్చిన కందులను 10 రోజులపాటు ఇంటి వద్ద ఉంచుకొని అధికారుల చుట్టూ తిరిగా. కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఆరా తీస్తే ఒక్కరూ సమాధానం చెప్పలేదు. అప్పు తీసుకొని సాగు చేస్తే పంట చేతికి వచ్చిన తర్వాత అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తట్టుకోలేక దళారులను ఆశ్రయించి క్వింటా రూ.7 వేలకు అమ్ముకున్నాను. దాదాపు ఖరీఫ్‌ అమ్మకాలు పూర్తయిన తరువాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏం లాభం?

– మంత్రు నాయక్‌, రైతు,

నెహ్రూనగర్‌ తండా, దుర్గి మండలం

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌, రబీలలో సుమారు 23,500 మెట్రిక్‌ టన్నుల కందులను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తాం. ఇప్పటికే 35 కేంద్రాలు ప్రారంభించాం. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు కంది విక్రయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నాం. తేమశాతం, ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయం వల్ల కొనుగోలు కేంద్రాలలో ఆశించిన స్థాయిలో కొనడం లేదు. తేమశాతం తగినంత ఉండి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి రైతు నుంచి కంది కొనుగోలు చేస్తాం.

– రమేష్‌, మార్క్‌ఫెడ్‌, పల్నాడు జిల్లా మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement