రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
చీరాల: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం 167ఏ వాడరేవు– పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ సమీపంలోని అనంతపూర్‌కు చెందిన బోయ సహస్ర (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం బోయ సహస్ర మరో యువకుడు అఖిల్ ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి చీరాల వస్తున్నారు. నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిపై విజయనగర్‌కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలం సమీపంలోని వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి టూటౌన్ సీఐ నాగభూషణం, సిబ్బంది చేరుకుని తీవ్రగాయాలైన సహస్ర, అఖిల్‌ను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సహస్ర మరణించింది. తీవ్రగాయాలైన అఖిల్ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గుంటూరు నుంచి చీరాలకు రావడానికి కారణాలు, అసలు ప్రమాదానికి గల కారణాలను తెలియరావాల్సి ఉంది.


