జనసేన నాయకుల ఘర్షణ
వినుకొండ: పల్నాడు జిల్లా పరిశీలకులు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలోనే జనసేనలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. జనసేన సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం వినుకొండకు వచ్చిన పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. సభలో నూజెండ్ల మండల కన్వీనర్ వేముల వెంకటేశ్వర్లను వేదికపైకి పిలవకుండా ఉపాధ్యక్షుడు రాజబాబును పిలవడంతో వివాదం మొదలైంది. వినుకొండలో జనసేన నాయకుడు నిశంకరరావు శ్రీనివాసరావు, నాగశ్రీను రాయల్ ఇరువురు ఎవరికి వారు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం వెల్లటూరు రోడ్డులో కొణిజేటి నాగశ్రీను రాయల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నిశంకరరావు శ్రీనివాసరావు తన అభిమానులతో హాజరయ్యారు. అధ్యక్షుడిని పిలవకుండా ఉపాధ్యక్షుడుని ఎలా పిలుస్తారని ప్రశ్నించడంతో నాగ శ్రీను వర్గీయులు వాదనకు దిగారు. నిశంకరరావు శ్రీనివాసరావు వర్గీయులపై విరుచుకుపడ్డారు. దీంతో పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. మీడియా కవరేజ్‌కి వెళ్ళిన విలేకరి పట్ల దురుసుగా ప్రవర్తించి సెల్‌ఫోన్, టాబ్‌ను లాక్కున్నారు. ‘అంతు తెలుస్తామని’ బెదిరించడంతోపాటు ఫోన్‌లో ఉన్న డేటాను డిలీట్ చేశారు. దీంతో ఒక వర్గం వారు పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. విభేదాలు వెలుగు చూడటంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.


