వేర్వేరు కేసుల్లో ఇద్దరు చోరుల అరెస్టు
నగరంపాలెం: చోరీ కేసుల్లో ఇద్దరు పాత నేరస్తులను దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు రూ.38 లక్షల విలులైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... దుగ్గిరాల గ్రామం బ్రాహ్మణబజార్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి పాత నేరస్తుడైన చిప్పాడ కేదారేశ్వరరావు(40)ని అదుపులోకి తీసుకుని, రూ.16.32 లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. చింతలపూడి గ్రామంలోని ఓ ఇంట్లో సుమారు రూ.20 లక్షల ఖరీదైన నగలు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. నెహ్రూనగర్ వాసి ఇమడాబత్తిని గోపి (38)ని మంగళగిరి షరాఫ్‌బజార్‌లో అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. విచారణలో నేరం రుజువుకావడంతో రూ.20.40 లక్షల విలువైన బంగారం, రూ.1.11 లక్షల ఖరీదైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.


