సూక్ష్మకళ మొనగాడు!
పెన్సిల్ మొనలపై మణిహారాలు
యడ్లపాడు: జీవితం అంటే కేవలం బతుకు తెరువు మాత్రమే కాదు, ఆ బతుకు చాటున ఒక తపన ఉండాలని నిరూపిస్తున్నారు కొణతం సంతోష్. చిలకలూరిపేటలోని సంజీవనగర్ గల్లీల్లో తిరుగుతుంటే ఒక సామాన్య వెల్డింగ్ కార్మికుడిలా కనిపించే ఆ యువకుడు చేతిలో చాక్ పీస్ పట్టినా.. పెన్సిల్ మొనను తాకినా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. చదివింది ఐదో తరగతే అయినా ఆయన కళాత్మక సృజన మాత్రం విశ్వవిద్యాలయాల స్థాయిని మించి సాగుతోంది.
ప్రశ్న నుంచి పుట్టిన ప్రయాణం..
ఒకనాడు దినపత్రికలో వచ్చిన చాక్‌పీస్‌పై ఏనుగు బొమ్మ అనే వార్త సంతోష్ జీవితాన్ని మలుపు తిప్పింది. అంత చిన్న వస్తువుపై బొమ్మ ఎలా సాధ్యం? అన్న ఒక సూక్ష ప్రశ్న సంతోష్‌లో జిజ్ఞాసను రగిల్చింది. ఆ ఆసక్తితోనే సూక్ష్మకళ వైపు మొదలైన ప్రయాణం...చార్మినార్, భరతమాత, గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయ నాయకుల ప్రతిమలను చాక్‌పీస్‌లపై ప్రాణం పోసేలా చేసింది. 2010లో పట్టణంలోని ఫార్‌కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ డాక్టర్ జెస్సీ ఎస్.బర్నబాస్ నుంచి విశిష్ట సేవా అవార్డును అందుకున్నారు. కేవలం బొమ్మలకే పరిమితం కాకుండా ఒకే చాక్‌పీస్‌తో 74 లింకుల గొలుసును తయారు చేసి 2011లో తొలిసారి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. మరుసటి ఏడాదే ఆ రికార్డును తానే తిరగరాస్తూ 79 లింకులతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి 2012లోనూ అవార్డు అందుకున్నారు. ఖాళీ బల్బుల్లో వైఎస్సార్, ఇల్లు ఈఫిల్ టవర్‌ఏర్పాటు, పుచ్చకాయపై భారతదేశం చిత్రపటం, మహాశివుడు తదితర దేవతామూర్తుల చిత్రాలు చెక్కి వాటిని పట్టణంలోని వినాయకచవితి, నవమి రాత్రుల పందిళ్లలో ప్రదర్శించి, ప్రశంసలు అందుకున్నారు.
లక్ష్యం.. గిన్నిస్ రికార్డు!
ప్రస్తుతం సంతోష్ చూపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌పై ఉంది. ఇప్పటికే ఇతర దేశానికి చెందిన కళాకారుడు 125 లింకుల పెన్సిల్ లిడ్ చైన్ గిన్నిస్ బుక్ రికార్డును నమోదై ఉంది. దానిని అధిగమించి 130 లింకులతో కొత్త చరిత్ర సృష్టించాలని ఆయన సంకల్పం. అంతేకాదు భారత జాతీయ గీతంలోని 150 అక్షరాలను పెన్సిల్ మొనపై చెక్కి తన దేశభక్తిని చాటుకోవాలని తపిస్తున్నారు. ఇటీవల కొండవీడు కోట ఉత్సవాల్లో ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. భావితరాలకు ఈ సూక్ష్మ కళపై అవగాహన కల్పించాలనేది ఆయన ఆశయం.
చిన్న పెన్సిల్ మొనపై సంతోష్ చేసిన విన్యాసాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. విద్యార్థులు రాసుకునే పెన్సిల్ లెడ్‌పై ఐ లవ్ ఇండియా అని చెక్కడం నుంచి, హంసలు, జిరాఫీలు, మత సామరస్య చిహ్నాల వరకు ఆయన సృజన అప్రతిహతంగా సాగుతోంది. 18 గంటల పాటు ఏకధాటిగా శ్రమించి, పెన్సిల్ లెడ్‌తో 80 లింకుల గొలుసును తయారు చేసి తన నైపుణ్యాన్ని శిఖరాగ్రాన నిలిపారు.
సూక్ష్మకళ మొనగాడు!


