నేడు ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు
తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసును సీబీఐ కోర్టు ఇటీవల మూసివేయడంతో ఆమె అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 20న కేసు మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు షంషద్‌బేగం, ఇక్బాల్‌బాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న ఉదయం తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. భద్రత నడుమ గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని సూచించారు. ఆమేరకు శుక్రవారం కోర్టులో పంచనామా జరిపిన అనంతరం అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించనున్నారు. చెంచుపేటలోని ఖబరిస్తాన్‌లో అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.


