విద్యార్థినిపై దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై దాష్టీకం

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

విద్య

విద్యార్థినిపై దాష్టీకం

● జుట్టు పట్టుకుని కొట్టిన ప్రిన్సిపల్‌ ● మోకాళ్లపై గంటల పాటు నిల్చోపెట్టిన వైనం ● ప్రకాష్‌నగర్‌ ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ దుశ్చర్య.. ● ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, మద్దతు ఇచ్చిన విద్యార్థి సంఘాలు

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిని ప్రిన్సిపాల్‌ జుట్టు పట్టుకొని ఈడ్చికొట్టడంతో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకొంది. జరిగిన అవమానాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో బంధువులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి. వివరాలు.. ఏనుగుల బజారుకు చెందిన బాలిక ప్రకాష్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాల ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌ శంకరరెడ్డి జుట్టు పట్టుకుని వీపుపై తీవ్రంగా కొట్టడంతో పాటు మోకాళ్లపై నిల్చోబెట్టి వేధించాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని డైరెక్టర్‌ శంకరరెడ్డితో వాగ్వాదానికి దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని బాలిక తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐ ఫిరోజ్‌, ఎస్‌ఐ వంశీకృష్ణ అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గాయాలైన బాలికను వైద్యశాలకు చికిత్స నిమిత్తం పంపారు.

విజిలెన్స్‌ దాడుల్లో భారీగా సిగరెట్లు పట్టివేత

సత్తెనపల్లి: అనుమతులకు విరుద్ధంగా బిల్లులు లేకుండా సిగరెట్లు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని అందిన సమాచారం మేరకు గుంటూరు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఇ.సూర్య శ్రవణ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక బజార్‌లో 15వ వార్డుకు చెందిన నోముల కోటేశ్వరరావు గృహంలో సోమవారం అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా అనధికారికంగా సిగరెట్లను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ సిగరెట్లపై చిత్రపరమైన ఆరోగ్య హెచ్చరిక లేకపోవడం, ఎటువంటి చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకపోవడాన్ని గుర్తించారు. నోముల కోటేశ్వరరావును విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా పట్టణంలో నివసించే ఉయ్యూరు సుబ్బారావు గుప్తా నుంచి ఈ సిగరెట్లను కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించారు. మొత్తం రూ.3,31,060 విలువైన మొత్తం ఆరు రకాల అనధికార విమల్‌, బ్లాక్‌, గోల్డ్‌ విమల్‌, విమల్‌, గోల్డ్‌శాండ్‌, పలాస్‌ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నోముల కోటేశ్వరరావు, ఉయ్యూరు సుబ్బారావు గుప్తాపై సత్తెనపల్లి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయబడుతుందన్నారు. తనిఖీలలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ అనిల్‌బాబు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమీర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రైలు కింద పడి మహిళ బలవన్మరణం

గురజాల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... గురజాలలో నివాసం ఉంటున్న వీరిశెట్టి వైష్ణవి (39) స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. భర్త కిషోర్‌ లెక్చరర్‌గా పనిచేస్తాడు. ఈక్రమంలో తెల్లవారు జామున మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ రైలు కింద పడి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో వైష్ణవి కొన ఊపిరితో ఉండటంతో స్థానికులు 108 సహాయంతో గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు.

వైద్యశాల ఎదుట బంధువుల ఆందోళన..

సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైష్ణవి బంధువులు ఆందోళన చేపట్టారు. వైష్ణవి మృతికి భర్త కిషోర్‌ కారణమని కిషోర్‌ వైష్ణవిని ఎప్పుడు కట్నం కోసం వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. గత కొంత కాలంగా చిత్రహింసలు పెడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వైద్యశాల వద్ద వైష్ణవి కుమారుడు విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది.

విద్యార్థినిపై దాష్టీకం 1
1/2

విద్యార్థినిపై దాష్టీకం

విద్యార్థినిపై దాష్టీకం 2
2/2

విద్యార్థినిపై దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement