ఫిర్యాదులన్నీ ‘ఆర్థిక’ వ్యవహారాలపైనే!!
బోరులో వాటా
ఇవ్వలేదని దాడి చేశారు
బంగారం పేరుతో మోసం
జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
ఫిర్యాదులు స్వీకరించిన
అదనపు ఎస్పీ (అడ్మిన్) సంతోష్
వివిధ సమస్యలపై 117 ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: ఆర్ధిక వ్యవహరాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీ ఆర్‌ఎస్ నిర్వహించారు, అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ అదనపు ఎస్పీ (క్రైం) ఎం.లక్ష్మీ పతిలు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించిన 117 ఫిర్యాదులు అందా యి. భూ వివాదాలపై 24, భార్యభర్తల మద్య వివాదాలు 22, ఆస్తుల వివాదాలపై 17 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని తెలిపారు.
బోరు బావిలో వాటా ఇవ్వలేదని తన భర్తపై బావ అతని కుమారుడు దాడిచేసినట్టు దుర్గిమండలం ఓబులేశునిపల్లికి చెందిన బొమ్మనబోయిన లక్ష్మీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన భూమిని తన భర్త, అయన సోదరుడు సమానంగా పంచుకున్నట్టు తెలిపారు. మా భూమిలో బోరు ఏర్పాటు చేసు కోగా ఇందులో మాకు వాటా ఉందని పలుమార్లు గొడవకు దిగారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మా బావ రమణయ్య, అతని కుమారుడు శివకృష్ణ, పోతురాజులు కలిసి నా భర్తపై దాడి చేయడంతో పాటు బోరును ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన కుంచాల పుల్లయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిరప పంట కోతకు వచ్చిన కర్ణాటకకు చెందిన వ్యక్తులు పరిచయమయ్యారు. వీరు తమకు బంగారం దొరికిందని తక్కువ ధరకు అమ్ముతామని తెలిపారు. రూ.50 లక్షలు విలువైన బంగారాన్ని రూ.13 లక్షలకు ఇస్తామని చెప్పారు. వీరి మాటలు నమ్మి నగదు చెల్లించి బంగారాన్ని తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులమని చెప్పి కొంతమంది అక్కడకు వచ్చి బంగారం ఎక్కడిదని బెదిరించి బంగారం, డబ్బు, సెల్‌ఫోన్‌లు తీసుకోని వెళ్లినట్టు వివరించాడు. చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అదనపు ఎస్పీని కోరాడు.


