అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా 151 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ, అధికారులు
నిషేధ జాబితా నుంచి తొలగించండి
నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించిన కలెక్టర్, జేసీ సంజనా సింహా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 151 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్ లేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు ఆయా శాఖల పరిధిలో గ్రీవెనన్స్‌పై అర్జీదారులతో మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలన్నారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌ను సందర్శించి కొంతమంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం రెవెన్యూ క్లినిక్ ద్వారా 40 అర్జీలు రాగా, వాటిలో గురజాల డివిజన్ నుంచి 12, సత్తెనపల్లి నుంచి నాలుగు, నరసరావుపేట నుంచి 24 అర్జీలు అందుకున్నారు. డీఆర్‌ఓ నారదముని, పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీరాములు, డీపీఓ నాగేశ్వరనాయక్, మూడు డివిజన్లకు చెందిన ఆర్‌డీఓ, పలువురు తహసీల్దార్లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
నా కుమారుడు షేక్ మహ్మద్ హసన్‌కు, షేక్ జిలాని రెండో కుమార్తె హసీనా జానీతో 2019లో సంప్రదాయంగా వివాహమైంది. 2023 వరకు కలిసి కాపురం చేశారు. నా కుమారుడితో గొడవపడి కోడలు నరసరావుపేటలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. దీనిపై నా కుమారుడు కోర్టు ద్వారా కాపురానికి రావాలని నోటీసులు పంపాడు. నా కుమారుడు, కోడలికి మధ్య ఎటువంటి విడాకుల వ్యవహారం జరగలేదు. సత్తెనపల్లికి చెందిన ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ రహమాన్‌ను సంప్రదించి ఖుల్లా దొంగ సర్టిఫికెట్‌ను కోడలు తండ్రి తీసుకున్నాడు. నా కుమారుడు, కోడలి దొంగ సంతకాలు సృష్టించి ఖుల్లా సర్టిఫికెట్ ఇచ్చారు. తన పరిధి కాకపోయినా ఖుల్లా సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వ ఖాజీపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి.
– చిరుమామిళ్ల సైదా,
ఇస్లాంపేట, నరసరావుపేట పట్టణం
పట్టణంలోని స్టేషన్‌రోడ్డులో గల హర్షా ట్రేడ్‌ర్స్ వద్ద గతేడాది అక్టోబరు మూడో తేదీన శివాజీ రకం మొక్కజొన్న విత్తనాలు రూ.3300లతో నాలుగు ప్యాకెట్లు కొనుగోలు చేశా. వాటిని పొలంలో విత్తాను. మొక్కజొన్న మొక్కకు కంకలు రాలేదు, వచ్చినా రోజులు గడుస్తున్నా విత్తనం ఏర్పడలేదు. దీంతో ఇవి నకిలీవిగా గుర్తించి వ్యాపారిని కలిసి అడిగితే తమకేమీ సంబంధం లేదని, కంపెనీ వారిని సంప్రదించాలని చెప్పాడు. అధికారులు జోక్యం చేసుకుని నాకు న్యాయం చేసి, నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి.
– పారా శ్రీనివాసరావు,
పమిడిపాడు, నరసరావుపేట మండలం
నాకు పిల్లుట్ల శివారులో నా బంధువులతో కలిసి 11.5 ఎకరాల పట్టా పొలం ఉంది. నేను అందులో ఐదున్నర ఎకరాలకు హక్కుదారుడిని. నేను గుంటూరులో నివాసం ఉంటాను. 2015లో దానికి రూ.15వేలు శిస్తు కూడా చెల్లించాను. ఏడాది కిందట ఆ భూమిని 22ఏ నిషేధ భూముల జాబితాలో చేర్చారు. నా బంధువుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆ భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించి ఆన్‌లైన్‌లో నా పేరు ఎక్కించాలని ఆరు నెలలుగా నాలుగుసార్లు అర్జీ అందజేశా. ఇప్పటివరకూ ఫలితంలేదు.
– కందుల సాంబశివరావు,
కొత్తగణేశునిపాలెం, మాచవరం మండలం
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి


