సుబ్రమణ్యేశ్వరునికి వెండి నెమలి తొడుగు ఆభరణం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రమణ్యేశ్వరస్వామికి దాతలు సోమవారం వెండి నెమలి తొడుగు ఆభరణం సమర్పించారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యార్లగడ్డ పవన్‌కుమార్, పూర్ణిమ సౌభాగ్యలక్ష్మి దంపతులు ఈ ఆభరణం సమర్పించారు. సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన వెండి నెమలి తొడుగు ఆభరణానికి అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రేఖ, అర్చకులు శంకరమంచి రాజశేఖర్ పాల్గొన్నారు.
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారంతో మూడవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూత్రిదండి చిన్నజీయర్‌స్వామి, త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి వార్ల స్వీయ పర్యవేక్షణలో ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం ఛాయాధివాసం, శ్రీ హయగ్రీవ ఇష్టి, జలాధివాసం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
తెనాలి: పట్టణానికి చెందిన శ్రీవిఖనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేట లోనీ కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో జరుగుతున్న శ్రీ మహా సుదర్శన హోమం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. తొలుత స్వామివారికి విశేష తులసి దళార్చనను వైఖానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ట్రస్టు నిర్వాహకులు ఆర్‌వీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి గానామృతం అయిదో పర్యాయం ముగింపు సందర్భంగా శ్రీమహా సుదర్శన హోమం నిర్వహించినట్టు తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్టు ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం నిర్మిస్తామని తెలిపారు. వైఖానస పండితులు మేడూరి శ్రీనివాసమూర్తి భూదాన విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ ,రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీష్, గార్లపాటి అశోక్, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సుబ్రమణ్యేశ్వరునికి వెండి నెమలి తొడుగు ఆభరణం


