నేడు గుంటూరుకు అంబటి
● కార్యకర్తలూ తరలిరండి ..
ఘన స్వాగతం పలుకుదాం..
● వైఎస్సార్‌సీపీ పొన్నూరు
అంబటి మురళీకృష్ణ పిలుపు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై గురువారం గుంటూరు రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రతి కార్యకర్త తరలిరావాలని వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్ధార్ధనగర్‌లోని అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
● అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రాంబాబు నివాసంపై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిందన్నారు. అంబటిపై దాడి చేసి టీడీపీ నేతలు తృప్తి చెందారని, ప్రజలు ఏమాత్రం హర్షించలేదన్నారు. ఈ ఘటన అనంతరం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో మనోధైర్యం నింపిందని చెప్పారు. అందుకు ఆయనకు సర్వదా కృతజ్ఞతలని తెలిపారు.
● వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేసిందని, వారి పనితీరుతోనే 36 కేసులు ఒక్క దెబ్బతో నిలుపుదల అయ్యాయని పేర్కొన్నారు.
● గురువారం కృష్ణా బ్యారేజీ వద్ద అంబటికి మంగళగిరి నేతలు స్వాగతం పలుకుతారని, అక్కడి నుంచి వచ్చిన తరువాత కాజ టోల్‌గేటు వద్ద గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరై ఆయనకు స్వాగతం పలుకుతారని తెలిపారు. పెదకాకాని నుంచి పొన్నూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో అంబటిని తోడుకొని వస్తారన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, రాబోయే రోజుల్లో దుష్ట శిక్షణ తథ్యమని హెచ్చరించారు.
● వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ అంబటి రాంబాబును 18 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి, అనేరకాల ఇబ్బందులు పెట్టారన్నారు.
● తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను బిహార్ కంటే ఘోరంగా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఏడు గంటలపాటు పోలీసుల సాక్షిగా అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడేనన్నారు.
● అంబటి ధైర్యానికి, ఆయన సిద్ధాతాలకు అభినందనలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి వెనుక నుంచి వెళ్లిపోవాలని చెప్పిన నేపథ్యంలో తాను వెనుకడుగు వేయబోనన్న ఆయన మనోధైర్యం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు.
● పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలతోనే దాడి జరిగిందని, టీడీపీ నేతలు 18 రోజులపాటు పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు.
● అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ కష్టకాలంలో అండగా నిలబడి ధైర్యం నింపిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లీగల్ విభాగం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
● సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.


