ఎనర్జీ అసిస్టెంట్
ఏసీబీ వలలో
నకరికల్లు: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహీంద్ర మత్తె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన గుండాల రౌతమ్మ అనే మహిళా రైతు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ నక్కబోయిన నాగేంద్రబాబు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ. 80 వేలు లంచం డిమాండ్ చేసి రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రౌతమ్మ కుమారుడు యోహాను ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అడిషనల్ ఎస్పీతో పాటు సీఐలు వి.సురేష్‌బాబు, ఎ.మన్మథరావు, బి.నాగ రాజు, ఎస్‌ఐలు ఊరుకొంద చిచా, జయ భారత్‌రెడ్డి, సుబ్బయ్యలతో కలిసి మొత్తం 20 మంది ఆకస్మికదాడి నిర్వహించారు. యోహాను నుంచి ఎనర్జీ అసిస్టెంట్ తన తండ్రి సహకారంతో రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తండ్రి, కొడుకులు ఇరువురిపై కేసు నమోదు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.
రైతు నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో పట్టివేత


