నిరవధిక దీక్షలు జయప్రదం చేయాలి
నరసరావుపేట: రైతుల హక్కుల సాధనకు సంఘం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ఈ నెల 23, 24 తేదీలలో పల్నాడు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న 30 గంటల నిరవధిక దీక్షలు జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్య దర్శి వై.రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం నిరవధిక దీక్షల గోడ ప్రతులు ఆవిష్కరించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ సాగు దారులలో 70 శాతం మందికి పైగా ఉన్న కౌలు రైతుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని పేర్కొన్నారు. కౌలు రైతుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ 30 గంటల దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ అర్హులైన కౌలు రైతులకు ఎటువంటి నిబంధనలు లేకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.పిచ్చరావు, నాయకులు పెండ్యాల మహేష్, కామినేని రామారావు, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు.
కౌలు రైతు సంఘం జిల్లా
ప్రధాన కార్యదర్శి వై.రాధాకృష్ణ


