బస్సులు లేక కొండ భక్తుల అగచాట్లు
●గంటల తరబడి ఎదురుచూసిన వందలాది మంది భక్తులు
●వినుకొండరోడ్డులో నిల్చిన ట్రాఫిక్
నరసరావుపేట: తిరునాళ్ల భక్తులు సకాలంలో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయటంలో ఆర్‌టీసీ, పోలీసు అధికారులు ప్రదర్శించిన ఉదాశీనత భక్తుల పాలిట శాపంగా పరిమణించింది. ఆదివారం కోటప్పకొండ వద్ద జరిగిన తిరునాళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చి తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు సోమ వారం ఉదయం కొండ నుంచి తిరుగు బస్సుల ద్వారా వేలాది మంది బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే బస్టాండ్ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి వైపునకు వెళ్లే బస్సులు లేకపోవటంతో గంటలతరబడి ఎదురు చూశా రు. అప్పుడప్పుడు అరకొరగా వచ్చిన బస్సును ఎక్కేందుకు భక్తులు నానా ప్రయాసలకు గురికావాల్సివచ్చింది. మరికొందరు బస్సులకోసం వేచి చూసీ చూసీ రోడ్డుపై నిలబడి ఆటోలు, ఇతర వాహనాలను పట్టుకొని అధిక ప్రయాణఖర్చులు భరించి తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లారు. దీంతో పాటు కోటప్పకొండ నుంచి బస్టాండ్‌కు వచ్చే బస్సులతో వినుకొండరోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణంలోని ప్రవేశించిన తర్వాత బస్టాండ్ చేరుకునేందుకు గంటల తరపబడి బస్సులోనే కూర్చోవాల్సి వచ్చింది. తెల్లవారుఝామున రెండున్నర, మూడుగంటలకు కోటప్పకొండ నుంచి బయలుదేరిన ప్రయాణీకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకునే సరికి ఉద యం ఏడుగంటలైంది. బస్సుల్లో అధిక భాగం కొండకు ఏర్పాటుచేసిన అధికారులు మరుసటిరోజు తిరుగు ప్రయాణీకులకోసం కావాల్సిన బస్సులను ఏర్పాటు చేయలేకపోవటంతో ఈ సమస్య ఉత్పన్నమైంది.


