రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించండి
మాచర్ల రూరల్: రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న పని భారాన్ని తగ్గించి సమయ పాలన ఏర్పాటు చేసి మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యానికి గురౌతున్న ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం స్పందించాలని గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరుముళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఇచ్చి న పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. వేళాపాళా లేని పనితో ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని, ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు బాధ్యతలు నిర్వహించటమే కాకుండా వివిధ శాఖ ల పనులు సైతం రెవెన్యూ వారిపై మోపుతూ మ రింత ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు పనిఒత్తిడితో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. మరణించిన వీఆర్‌ఓలకు సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు సంఘీభావంగా ఉంటామన్నారు. వీఆర్‌ఓలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారందరికీ రెవెన్యూ అధికారుల సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వలన గ్రామస్థాయిలో వీఆర్‌ఓలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జాబ్ చార్ట్ ప్రకారం విధులు లేకుండా అన్నీ పనులు చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ విష యం పై ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఖాజావలి, ఆర్‌ఐ ఇంటూరి అనిల్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ యశోదారాణి, వీఆర్‌ఓలు నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, ఉమాదేవి, రత్నప్రకాష్, అన్నారావు, ఇషావలి, కోటయ్య తదితరులున్నారు.
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరుముళ్ళ నాగేశ్వరరావు


