సోషల్ మీడియాలో పోస్ట్‌పై విచారణ
సత్తెనపల్లి: సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని పోలీస్‌స్టేషన్ కు పిలిపించి శుక్రవారం విచారణ చేపట్టారు. పట్టణానికి చెందిన కొణతం స్వాతి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగాను, మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్‌గాను వ్యవహరిస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో పట్టణంలో జరుగుతున్న అక్రమాలను వెల్లడిస్తూ పోస్ట్ చేశారు. ఇది తమ నాయకులను ఉద్దేశించి చేశారంటూ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు నాగరాజు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు స్వాతికి 41 నోటీసు అందించారు. అందులో భాగంగా స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని వివరాలు సేకరించి మరోసారి విచారణకు పిలిపిస్తామని చెప్పిపంపించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు జానీ, జిల్లా ఎస్టీ సెల్ చేవూరి మధుబాబు, సత్తెనపల్లి సోషల్ మీడియా అధ్యక్షులు కాటేపల్లి శేషుయాదవ్, లీగల్ సెల్ ఏడుకొండలు, అరవింద్‌లు స్వాతిని కలిసి సంఘీభావం తెలిపారు.


