నౌకా వాణిజ్యంలో ఒడిశాదే అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

నౌకా వాణిజ్యంలో ఒడిశాదే అగ్రస్థానం

Nov 25 2026 4:18 AM | Updated on Nov 25 2026 4:18 AM

● రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

● కటక్‌ బాలి జాతర ప్రారంభించిన రాష్ట్రపతి

భువనేశ్వర్‌: ప్రాచీన కాలంలో నౌకా వాణిజ్యంలో దేశంలోనే ఒడిశా అగ్రస్థానంలో ఉండేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నాటి కళింగ నావికుల సాహసాలు, నైపుణ్యం, వ్యాపార దక్షత నుంచి నేటి యువత ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. గత వైభవం నుంచి స్ఫూర్తి పొంది వర్తమానాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచే బలియాత్ర ప్రత్యేకమైన ఉత్సవమని అభివర్ణించారు. కటక్‌లో 2026 బాలి జాతరను ప్రారంభించిన సందర్భంగా మంగళ వారం రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రాచీన కాలంలో కళింగ నావికులు సముద్ర మార్గాల ద్వారా బాలి సహా ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించిన చరిత్రను గుర్తుచేశారు. సాధవుల నైపుణ్యం, దూరదృష్టి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. 2036 నాటికి ఒడిశా రాష్ట్ర అవతరణకు వందేళ్లు పూర్తవుతాయని, అప్పటికి రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెంది దేశంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. 1904లో మధుసూదన్‌ దాస్‌ కటక్‌లో స్థాపించిన ఉత్కళ టానరీ పారిశ్రామిక స్వావలంబనకు నిదర్శనమని, నేటి యువ పారిశ్రామికవేత్తలకు అది స్ఫూర్తిదాయకమని చెప్పారు. కంధమల్‌ పసుపు, కొరాపుట్‌ కాఫీ వంటి ఒడిశా ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. బాలి దేశంతో సహకార సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రశంసించారు. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నదులు మనకు తల్లితో సమానమని, వాటిని కలుషితం చేయకూడదని హితవు పలికారు. బాలి జాతర ముగిసిన అనంతరం ఉత్సవ ప్రాంగణం సమీపంలోని నదిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement