న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2026
భక్తిశ్రద్ధలతో..
రాయగడ:
కార్తీక మాసంలో భాగంగా అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. తెల్లవారుజామున నాగావళి నది సమీపంలో విశేష పూజలను నిర్వహించిన అనంతరం గంగమ్మ తల్లి ఒడికి పడవలను వదిలి అ తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. దీంతొ నదీ ప్రాంతాలు భక్తులతో సందడిగా కనిపించాయి. ఒడియా ప్రజలకు దీంతో కార్తీక మాసం పూర్తి కాగా తెలుగు వారికి కార్తీకమాసం మరో 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇదిలా ఉండగా స్థానిక జగన్నాథ మందిరంలో అష్ఠప్రహారి, హరేరామ, హరేక్రిష్ణ సంకీర్తనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. సంకీర్తన బృందం జగన్నాథ మందిరానికి భజనలు చేస్తు జగన్నాథ మందిరానికి చేరుకున్నారు.
ఘనంగా కార్తీక పౌర్ణమి
కొరాపుట్: కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం వేకువ జాము నుంచి కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్ల ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నదులు, రిజర్వాయర్లు, చెరువులు, జల పాతాల వద్ద అధికసంఖ్యలో భక్తులు బారులు తీరారు. పవిత్ర దీపాలతో పడవలు వదిలారు. ఉత్కళ ప్రజలు కార్తీక మాసం ముగింపు సందర్భంగా బొయితి బందనో ఉత్సవం జరుపుకున్నారు. రాత్రంతా భజనలు, సంకీరన్తలతో దేవాలయాలు హోరెత్తాయి.
పర్లాకిమిడి: కార్తీక పౌర్ణమి సందర్భంగా మహేంద్రతనయ నదిలో మంగళవారం వేకువజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి నదీ స్నానాలు చేసి, అరటి దొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి వదిలారు. దీన్ని ఒడియాలో బోయితో బొంధొనొ ఉత్సవం అని పిలుస్తారు. అనంతరం మహిళలు మెడికల్ రోడ్డులో ఉన్న అర్ధనారీశ్వరి మందిరం, జగన్నాధ స్వామి మందిరాల్లో దర్శనం చేశారు. అనేకమంది భక్తకోటి మంగళవారం కార్తీకపౌర్ణమి నోములు సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు.
జయపురం: జయపురం జగన్నాథ్ సాగర్ ప్రాంతం అష్ట శంభు క్షేత్ర పంచానన మందిర కూడలి వద్ద సోమవారం రాత్రి సంప్రదాయంగా బొయితొ బొంధొన ఉత్సవం జరిగింది. ఉత్సవంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఉత్సాహ పరిచారు.
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కన్‌గిరి పట్టణంలో మంగళవారం భక్తులు చెరువుల వద్ద తెప్పలు వదిలారు. అనంతరం శివాలయాలకు వెళ్లి పూజలు చేశారు.


