రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని సుగంధభరితమైన చందనంతో అత్యంత సుందరంగా అలంకరించారు. చందనాలంకరణలో స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించుకుపోయారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.
మల్కన్‌గిరిలో దొంగల హల్‌చల్
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి పట్టణంలో దొంగల బెడద పెరుగుతుండటంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న రాజ్ జ్యూవెలర్స్ అనే బంగారు నగల దుకాణం షట్టర్‌ను పగులగొట్టి చోరీకి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పట్టణ భద్రతా వ్యవస్థపై చర్చ మొదలైంది. దుకాణ యజమాని రాకేష్ తెలిసిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి సుమారు 2 గంటల నుంచి 3 గంటల మధ్య గుర్తుతెలియని దుండగులు దుకాణం షట్టర్‌ను పగలుగొట్టి చోరీకి ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అలరించిన గాన లహరి
పర్లాకిమిడి: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీజగన్నాథ మందిరం ప్రాంగణంలో పరలా కళా, సంస్కృతి ట్రస్టు ఆధ్వర్యంలో భవ్య భక్తి సంగీత, భజన కార్యక్రమానికి హైటెక్ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరయ్యారు. ఈ భక్తి సంగీత భజన కార్యక్రమంలో భుభనేశ్వర్ నుంచి విచ్చేసిన ప్రముఖ గాయనీగాయకులు కుమార్ బప్పి, బంకోచరణ్ దాస్, నరేంద్ర కుమార్, లీనా ప్రధాన్, పంచూరీ దాస్ ప్రధానాకర్షణలుగా నిలిచారు. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులను ఎమ్మెల్యే తిరుపతి పాణిగ్రాహి సన్మానించారు. జిల్లా పరిషత్తు చైర్మన్ గవర తిరుపతిరావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్ల బాలికని ఎత్తుకెళ్లిన చిరుత పులి
కొరాపుట్: రెండేళ్ల బాలికను చిరుత పులి ఎత్తుకెళ్లిన దారుణ ఘటన చోటు చేసుకుంది. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి నక్కిటి సిమర గ్రామ పంచాయతీ జొడియా పరా గ్రామంలో విష్టు గొండో కుమార్తె వేదిక గొండో (2) మృతి చెందింది. రాత్రి మూత్ర విసర్జనకి బాలిక బయటకు రాగా అకస్మాత్తుగా పులి దాడి చేసి పట్టుకు పోయింది. ఇది గమనించిన బాలిక నాన్నమ్మ పులి వెంట పరుగులెత్తినప్పటికీ ఫలితం లేక పోయింది. సమీప అడవిలోనికి పులి వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు అడవిలో గాలింపు చేపట్టారు. ఇది తెలిసి అటవీ శాఖ సిబ్బంది రంగం లోనికి దిగి డ్రోన్ కెమెరాలతో గాలించారు. సమీప చత్తీస్‌గఢ్ రాష్ట్ర అటవీ బృందాలు కూడా గాలింపులో పాల్గొన్నాయి. సమీప అటవీ ప్రాంతంలో బాలిక అవశేషాలు గిరిజనులు గుర్తించారు. ఈ ఘటనతో రాయగర్ ప్రాంతంలో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.


