రాయగడ: స్థానిక ఇందిరానగర్ మొదటి లైన్లో నివసిస్తున్న శతాధిక వృద్ధురాలు వై.నారాయణమ్మ (112) గురువారం మృతి చెందారు. పొరుగు రాష్ట్రం మన్యం పార్వతీపురం జిల్లాలోని కొమరాడ మండలం పరిధిలోని కొటిపాము గ్రామంలో 1914లో జన్మించారు. ఆమె చిన్న కుమారుడు చిన్నంనాయుడు ఉద్యోగ రీత్యా రాయగడలో స్థిరపడ్డారు. దీంతో కొడుకుతో పాటు ఆమె కూడా ఇక్కడే ఉంటున్నారు. గురువారం ఉదయం ఆమె మృతి చెందినట్లు మనువడు వై.దామోదరరావు తెలిపారు. ఆమె జీవించినంత కాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా తన పనితానే చేసుకునేవారని చెప్పారు. తమ కుటుంబంలో ఐదు తరాలను చూసిన నారాయణమ్మ సహజ మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.


