పిడుగుపాటు నష్టం నివారణకు జాతీయ వర్కుషాపు | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటు నష్టం నివారణకు జాతీయ వర్కుషాపు

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

భువనేశ్వర్‌: పిడుగులు మెరుపుల వల్ల సంభవించే ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అంచనాలు, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఓఎస్‌డిఎంఏ) ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ వర్కుషాపు గురువారం ప్రారంభమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి ఈ వర్కుషాపును ప్రారంభించారు. అక్టోబర్‌ 15, 16 తేదీల్లో జరిగే ఈ సదస్సులో మెరుపుల భద్రతకు సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) ముసాయిదా, 2027 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై నిపుణులు చర్చించనున్నారు. ప్రారంభోత్సవంలో మంత్రి సురేష్‌ పూజారి మాట్లాడుతూ మెరుపుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్న నేపథ్యంలో వాటి ముప్పును ఎదుర్కోవడం కీలకమన్నారు. మెరుపుల కారణంగా సంభవించే మరణాలు, నష్టాలను తగ్గించేందుకు ఓఎస్‌డిఎంఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా అధికారులు ఒకే వేదికపై చర్చించి సమర్థవంతమైన నివారణ చర్యలను గుర్తించేందుకు ఈ కార్యశాల దోహదపడుతుందని తెలిపారు. విపత్తుల ముప్పును తగ్గించడంలో ఒడిశా సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రో మాట్లాడుతూ, ఉపగ్రహ సమాచారంతోపాటు సంఖ్యాత్మక వాతావరణ అంచనా నమూనాలు, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుపులను గుర్తించడం, పర్యవేక్షించడం, ముందుగా అంచనా వేయడంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. పంచాయతీ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే వ్యవస్థలతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించడంపైనా వర్కుషాపులో చర్చించనున్నట్లు తెలిపారు.

ఓఎస్‌డీఎంఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌ మాట్లాడుతూ, మెరుపుల ముప్పును ముందుగా అంచనా వేయడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, హెచ్చరికలను సకాలంలో ప్రజలకు చేరవేయడం, భద్రతా చర్యలను బలోపేతం చేయడం ఈ కార్యశాల ప్రధాన లక్ష్యమని వివరించారు. ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక చర్యలుగా మార్చడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత వాతావరణ శాఖ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌, ఐఐటీ భువనేశ్వర్‌, ఫకీర్‌ మోహన్‌ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ పాట్నా తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement