రాయగడ: క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లాలో మూడు రోజుల పాటుగా జాతీయ క్రీడా దినోత్సవం–2026 ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రవీవద్ర కుమార్ కుహరో పర్యవేక్షణలో మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఏడాది భేలేగా భారత్..జీతేగా భారత్ అనే ప్రధాన సందేశంతో చిన్నారులు, యువతను క్రీడల వైపు ఆకర్షించడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్రీడలను నిత్యజీవితంతో భాగంగా చేసుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ క్రమంలో ట్రిబ్యూట్ థీమ్‌తో దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, క్రీడా రంగ ప్రముఖులకు డిజిటల్, సామాజిక కార్యక్రమాల ద్వార ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్లే థీమ్ కార్యక్రమంలో భాగంగా ప్లేగ్రౌండ్‌లో ఒక గంట ఆట అనే సందేశంతో జిల్లాతోని వివిధ పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీని కూడా నిర్వహించారు. థీమ్ మూడులో భాగంగా స్పెషల్ సండేస్ సైకిల్ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ తొక్కడం, ఇతర శారీరక వ్యాయామాల్లో ప్రజలు, యువత చురుగ్గా పాల్గొనేలా అవగాహన కల్పించారు. ఈ సైకిల్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర కుమార్ కుహరో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు ప్రారంభించారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారి భద్రత, అవసరమైన నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సంబంధించిన ఏర్పాట్లు ముందుగానే చేపట్టారు. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ పర్యవేక్షించారు.


