● సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో తోడ్పాటు ● అంతరించిపోతున్న కళను ఆదరిస్తున్న సంస్థలు ● నేడు హరికథా పితామహుడు ‘నారాయణదాసు’ జయంతి
శ్రీకాకుళం కల్చరల్ : సకల కళల సమాహారంగా నిలిచే హరికథకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒకే వ్యక్తితో సందర్భానుసారంగా హావ, భావ, రాగ, తాళ, నాట్య విన్యాసం ఆవిష్కరించడం ఈ కళ గొప్పతనం. ప్రాచీన జానపద కళారూపమైన హరికథను సంస్కరించి సామాన్యుని మనోజన హృదయ రంజకంగా తీర్చిదిద్దిన ఘనత హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుకే దక్కుతుంది. అందుకే ఆయన హరికథా పితామహుడయ్యారు. కొన్ని గంటల సమయంలో పురాణ కథ, కీర్తనలు, పద్యం, మంజరి, తోహరా, వచనాలతో రసవత్తరమైన గాన, తాళ, భావయుక్త, పరిపూర్ణమైన మహోన్నత కథా కధనం తయారుచేసి నవరస భరితంగా ప్రదర్శించగల గంధర్వుడు ఆదిభట్ల. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల ద్వారా హరికథలను ఆదిరించి జీవింపచేస్తున్నారు. ఆవిధంగా హరికథ ఇప్పటికీ జనాదరణలోనే ఉంటోంది. రేడియోలలో ఇప్పటికీ హరికథకులకు ఆదరణ లభిస్తోందనే చెప్పాలి. ఈ కళకు గుర్తుగా జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ప్రముఖ కళాభిమాని డాక్టర్ నిక్కు అప్పన్న.. నారాయణదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలో హరికథకులు..
శ్రీకాకుళం జిల్లా హరికథ చరిత్రలో ఈశ్వర సత్యనారాయణ శర్మ ప్రథములు. ఈయన శర్మద రామాయణం, భక్తనందనార్, సతీసులోచన, వామన చరిత్ర, లక్ష్మీవిజయం, త్యాగరాజ, శ్రీనివాస కల్యాణం, సతీ పరిణయం రచించారు. డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు హరికథలపై పరిశోధన గ్రంథాన్ని రచించి బర్హెంపూర్ యూనివర్సిటీకీ సమర్పించి డాక్టరేట్ పొందారు. జిల్లాలో సీనియర్ భాగవతారులైన దివంగత దూసి బెనర్జీ ఇంగ్లీషులో కూడా హరికథ చెప్పగల దిట్టగా పేరుగాంచారు. బుసకల రంగారావు, యెన్ని రామం, ముగితి వెంకటనారాయణ, బొంతలకోటి యతిరాజులు, వడగ సుబ్రహ్మణ్యం, జయంతి సావిత్రి, రోణంకి మీనాక్షి, సిద్దేశుల శారదాంబ, సరోజిని, పి.వి.సత్యనారాయణ, ఎం.శివదండాసి వంటి ఎందరో భాగవతారులు కళను తమ ప్రదర్శనలతో బతికిస్తున్నారు. ఇంకా ఎందరో హరికథా గానం చేస్తూ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.
సుమిత్రా కళా సమితి ప్రోత్సాహం..
జిల్లాలో సుమిత్రా కళా సమితి నిర్వాహకులు హరికథ కళను ఆదరిస్తున్నారు. ప్రతి ఏడాది హరికథా సప్తాహం నిర్వహిస్తూ కళ కోసం కృషి చేస్తున్నారు. జిల్లా కళాకారులనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా యువ కళాకారులను తీసుకువచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 6న బాపుజీ కళామందిర్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.రంగస్థ కళాకారులు కూడా హరికథ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తు కళను ఆదరిస్తున్నారు.


