భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో తలెత్తిన ఎలుకలు, బొద్దింకలు బెడద సేవాయత్‌లలో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ బెడదను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆలయ యంత్రాంగం చర్చిస్తోంది. శ్రీ జగన్నా థ ఆలయ పరిపాలన (ఎస్ జేటీఏ) కార్యాలయంలో సీనియర్ సేవాయత్‌లు, ఛొత్తీసా నియోగ నాయక జనార్దన్ పట్టజోషి మహా పాత్రో, దైతపతి నియోగ కార్యదర్శితో పూరీ జిల్లా కలెక్టర్ దిబ్యజ్యోతి పరిడా సవివరంగా చర్చించారు. రాత్రి పూట దేవతా మూర్తులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఆలయం లోపల ఉండే చీకటిని ఎలుకలు, బొద్దింకలు అవకాశంగా తీసుకుని ఇబ్బంది కలిగిస్తున్నాయని పట్టజోషి మహా పాత్రో తెలిపారు. దేవతామూర్తుల పవిత్ర దేహానికి ఎలాంటి హాని జరగకుండా నివారించడంపై సేవాయత్‌లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు. రాత్రి పూట దేవతా మూర్తులు విశ్రాంతి తీసుకునే సమయంలో జయ, విజయ ద్వారం నుంచి గర్భగుడి వరకు ఉన్న ప్రాంతం చీకటిగా ఉంటుంది. ఇది కీటకాలు తిరగడానికి అవకాశం కల్పిస్తుందని పట్టజోషి మహా పాత్రో అన్నారు. పలు సందర్భాల్లో ఎలుకలు, బొద్దింకలు కనక ముండి చందువాలోకి (దేవతామూర్తుల తలపైన ఉండే పందిరి) కూడా ప్రవేశించినట్లు సమాచారం. ఆలయ సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎలుకల కోసం బోనులు పెట్టడం, బొద్దింకలను ఆకర్షించడానికి బెల్లం ఉన్న కుండలను ఉంచడం వంటి నిర్దిష్ట చర్యలు సేవాయత్ వర్గం సూచించింది. ఆలయంలోని స్థిరపడిన సంప్రదాయాలను పాటిస్తూనే ఈ సమస్యను పరిష్కరించే చర్యలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఎస్‌జేటీఏ ప్రధాన నిర్వాహకుడి (సీఏఓ) అధ్యక్షతన త్వరలో మరో సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు.
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
రాయగడ: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కల్యాణసింగుపూర్ సమితి పునాఖండి పంచాయతీలోని సనోఘటి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల మధ్య విసిగెత్తిన గ్రామానికి చెందిన విష్ణు కులసి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిని కుటుంబీకులు ఆపస్మారక స్థితిలో ఉన్న విష్ణు కులసిని చూసి వెంటనే కళ్యాణసింగుపూర్ పీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
వరద బాధితులకు
నిత్యావసరాల పంపిణీ
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ సమితిలోని వరద ప్రాంతాలను కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక ఆదివారం పర్యటించారు. ఇంద్రావతి నది ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు పడటం వలన కొట్‌పాడ్ సమితిలోని 6 గ్రామ పంచాయతీల్లో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సస్మిత మెలక తన బృందంతో ముంపు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి వారికి ప్రభుత్వ అధికారులు అందించే సహాయంపై అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు, వృద్ధులకు దుప్పట్లు, బియ్యం, అటుకులు, బెల్లం, దుస్తులు పంపిణీ చేశారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించటం జరుగుతుందన్నారు. బాధితులందరికి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు బొరిగుమ్మ సమితి 1వ జోన్ పరిషత్ సభ్యులు ప్రసాద్ బిడిక, మంత్రి ప్రతినిధి నరేంద్ర బిశాయి, కొట్‌పాడ్ సమితి చైర్మన్ తపన కుమార్ పాణిగ్రహి, జిల్లా పరిషత్ కొట్‌పాడ్ జోన్–2 సభ్యురాలు గీతాంజలి మఝి, మనోజ్ పండా, కొట్‌పాడ్ సమితిలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


