ఏకాంత గదికి జగన్నాథుడు | - | Sakshi
Sakshi News home page

ఏకాంత గదికి జగన్నాథుడు

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

భువనేశ్వర్‌: దేవ స్నాన పూర్ణిమ సందర్భంగా 108 కలశాల సుగంధ ద్రవ్యాలతో కూడిన నీటితో చేసిన భారీ స్నానం తర్వాత అస్వస్థతకు గురై దేవతా మూర్తులకు జ్వరం వస్తుందని నమ్ముతారు. చికిత్స కోసం సోమ వారం రాత్రి నుంచి మూల విరాట్లకు తెరమరుగు చేశారు. ఏకాంత గదిలో శ్రీ జగన్నాథుడు విశ్రాంతి పొందుతూ సుమారు 15 రోజుల పాటు గోప్యంగా వైద్య సేవలు పొందుతాడు. ఈ కాలంలో భక్తులకు మూల విరాటుల దర్శనం అనుమతించరు. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీమందిరంలో దర్శనం మూసి వేయడంతో భక్తులు దర్శనం కోసం బ్రహ్మగిరిలోని అలార్‌నాథ్‌ ఆలయానికి తరలి వెళ్తున్నారు. పూరీకి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరిలోని ఈ చిన్న ఆలయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీస్తుశకం 1610 లో శ్రీ చైతన్య మహాప్రభు తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో బస చేసినప్పుడు శ్రీ జగన్నాథుడు సాక్షత్కరించడంతో అలార్‌ నాథ్‌ పేరుతో నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు. శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుడు తెరమరుగైన సమయంలో అలార్‌నాథ స్వామిని ఒక్క రోజు దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా 365 రోజుల పాటు జగన్నాథ స్వామిని దర్శించడం వల్ల లభించే పుణ్యానికి సమానం అని నమ్ముతారు. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవిల మధ్య నల్ల గ్రానైట్‌తో చతుర్భుజ నారాయణుని రూపంలో అలార్‌ నాథ స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఈ కాలంలో స్వామికి ప్రత్యేకమైన ఖిరీ భోగాన్ని సమర్పిస్తారు. పాలతో చేసే ఈ తీపి నైవేద్యానికి భక్తులలో విపరీతమైన గిరాకీ ఉంటుంది.

రద్దీ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

భద్రత, సులభ దర్శనం కల్పించేందుకు 7 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. 50కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శ్రీ మందిరంలో మూల విరాట్లు తెర మరుగు కావడంతో చిత్ర పటాలు దర్శనం ఇస్తున్నాయి. రత్న వేదికపై బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునికి ప్రతి రూపాలుగా వేర్వేరుగా 3 చిత్ర పటాల్ని దర్శనం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పొట్టా చిత్రాలుగా పేర్కొంటారు. సింహ ద్వారం ఆవరణలో కుడ్య ప్రతిమ పతిత పావనుని స్థానంలో కూడ పొట్టా చిత్ర రూపంలో భక్తులకు దర్శనం ప్రాప్తిస్తుంది. స్వామి ఆరోగ్యం కోలుకునేంత వరకు ఈ చిత్ర పటాల దర్శనమే ప్రాప్తిస్తుంది.

భక్తులను తరింపజేస్తున్న అలార్‌ నాథ స్వామి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement