బాధిత రైతుల సమావేశం | - | Sakshi
Sakshi News home page

బాధిత రైతుల సమావేశం

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

జయపురం: జయపురం నుంచి బొయిపరిగుడ మీదుగా మల్కన్‌గిరికి వేయనున్న రైల్వేలైన్‌ వలన భూములు కోల్పోయిన బాధితులు బొయిపరిగుడ సమితి దశమంతపూర్‌ గ్రామ పంచాయితీ హఠపొదర్‌ గ్రామంలో మంగళవారం సమావేశమయ్యారు. వారంతా ప్రభుత్వం భూ ములకు ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అయితే రైల్వే భూసేకరణ చట్టం 2022–23 నోటిఫికేషన్‌ ప్రకారం రైతుల భూములకు నిర్ణయించిన ధరపై తీవ్ర అంసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక ఎకరా ధర కోట్లలో ఉందని, అందువలన ఆ ధర చెల్లించాలన్నారు. అలాగే భూములు ఇచ్చిన రైతు కుటుంబంలో ఒక సభ్యుడికి వారి చదువును బట్టి తగిన ఉద్యోగం రైల్వే డిపార్టుమెంట్‌లో కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

రాయగడ: లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. స్థానిక లయన్స్‌ క్లబ్‌ సమవేశ మందిరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. క్లబ్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబురావు మహంతి, కార్యదర్శిగా దాశరథి రాజ్‌గురు, కోశాధికారిగా ప్రభాకర్‌లు నియమితులయ్యారు. కొత్తగా కొలువు దీరిన కార్యవర్గాన్ని లయన్స్‌ సీనియర్‌ సభ్యుడు డాక్టర్‌ దుఖిశ్యామ్‌ దాస్‌, డిస్టెట్‌ గవర్నర్‌ అశ్వినికుమార్‌ దాస్‌, వి భాస్కరరావు, టి జయరాం, శుశ్రిత దాస్‌ తదితరులు అభినందించారు. క్లబ్‌ తరుపున భవిష్యత్‌లో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి అధ్యక్షుడు బాబురావు మహంతి వివరించారు.

విధి నిర్వహణలో అస్వస్థతతో ఉద్యోగి మృతి

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో తలమునకలై ఉండగా ఆకస్మిక అస్వస్థతకు గురైన సిబ్బంది మృతి చెందాడు. తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్‌ మండల ఆస్పత్రిలో పని చేస్తున్న 58 ఏళ్ల ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ నృసింహ చరణ్‌ మహంతి (చిన్నా) కన్ను మూశారు. విధి నిర్వహణలో ఉండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. భువనేశ్వర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. తోటి సిబ్బంది మృతిపై విచారం వ్యక్తమైంది. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్‌ కాంగ్రెసు కార్యకర్తలు ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.

రథయాత్రకు ఓఏఎస్‌

అధికారుల నియామకం

భువనేశ్వర్‌: పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర పటిష్ట నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఓఏఎస్‌ అధికారులను నియమించింది. వారికి ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధికారాలతో ప్రత్యేక బాధ్యతలను కేటాయించింది. ఇంతకు ముందు యాత్ర నిర్వహణ కోసం 43 మంది ఓఏఎస్‌ అధికారులను నియమించిన విషయం తెలిసిందే.

బాలికపై లైంగిక దాడి..

20 ఏళ్ల కారాగారం

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహన బ్లాక్‌ పిండికి వద్ద ఒక యువకుడు రాజేంద్ర జన్ని(26) బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానాను విధిస్తూ మంగళవారం జిల్లా అదనపు సెషన్సు జడ్జి హరి ప్రసాద్‌ తీర్పునిచ్చారు. 2024 ఫిబ్రవరి 10న నిందితుడు బాలికను మోహన బ్లాక్‌ చాందిపుట్‌ నుంచి ఎత్తుకెళ్లి పిండిక అటవీ ప్రాంతంలో కోల్డు డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి లైంగికదాడికి పాల్పడడంతో ఆమె ప్రమాదకర స్థితికి వెళ్లిపోయింది. సంఘటన వివరాలు తెలుసుకున్న ఆమె తండ్రి చాందిపుట్‌ సంత నుండి వచ్చి మోహన పోలీసుష్టేషన్‌లో నిందితుడు రాజేంద్ర జన్నిపై కేసు పెట్టారు. ఈ కేసును మంగళవారం జిల్లా కోర్టులో హియరింగ్‌ జరుపగా నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో ఏడేళ్ల జైలు శిక్ష, రూ.యాభై వేల జరిమానా విధించారు. కేసును ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యం.పృథ్వీరాజ్‌ వాదించగా సీనియర్‌ క్యాడర్‌ పి.పి. రాజేష్‌ కుమార్‌ మిశ్రా సమాచారం విలేకరులకు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement