పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నేల పనస పండ్లు, మామిడి పండ్లు పంట చివరి దశకు చేరుకుంది. జిల్లాలో రామగిరి ప్రాంతం సిందిబా, జిరంగో, మండలసాయి, గుమ్మ, సెరంగో ప్రాంతంలో పండుతున్న నేల పనస పండ్లు ప్రస్తుతం ధరలేక రోడ్డుపైన చిరువ్యాపారులు పారబోస్తున్నారు. అలాగే మామిడి పండ్లు ఈ ఏడాది కాశీనగర్, గుమ్మ, గుసాని, రాయఘడ బ్లాక్‌లలో విపరీతంగా పంట దిగుబడి రావడంతో వంద రూపాయలకు నాలుగు, ఐదు కిలోలు అమ్మారు. ప్రస్తుతం పంట చివరి దశకు రావడంతో మామిడి పండ్లు ధర రూ. 100లకు కిలోన్నర లెక్కన అమ్మకాలు సాగిస్తున్నారు. అలాగే నేల పనస దిగుబడి ప్రస్తుతం ఎక్కువగా రావడంతో పండు ఒకటి రూ.10, రూ.5లు చొప్పున అమ్మారు. కొనుగోలుదారులు రాకపోవడంతో సాయంత్రం అయితే రోడ్డున పారబోస్తున్నారు. అయితే అతి రుచి కలిగిన క్వీన్ నేల పనస రకం మాత్రం డజను రూ.480 లు చొప్పున అమ్ముతున్నారు. క్వీన్ రకం నేల పనస భువనేశ్వర్, విశాఖపట్నంకు ఎగుమతి అవ్వడం వల్ల రైతులు ఈ పంట పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


