డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పోలింగ్‌ స్టేషన్ల డిజిటలైజేషన్‌ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) – 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం అరసవల్లి మిల్లు జంక్షన్‌ వద్ద 131 పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించి అపార్ట్‌మెంట్లో ఉన్న ప్లాట్‌ యజమానులతో మాట్లాడారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 30 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు నగర సహాయ టౌన్‌ ప్లానర్‌ జానకి తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

జె.భైరిపురంలో చైన్‌స్నాచింగ్‌

కంచిలి : జె.భైరిపురంలో సోమవారం రాత్రి చైన్‌స్నాచింగ్‌ జరిగింది. గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలు బల్ల సావిత్రి రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామంలో మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న చెరువుకు వెళ్లింది. అదే సమయంలో ముగ్గురు దుండగులు మోటార్‌ సైకిల్‌పై వచ్చి వృద్ధురాలి మెడలో ధరించిన ఒకటిన్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. దుండగుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా బైక్‌పై ఒడిశా వైపు పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ పి. పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సేవలకు సత్కారం

మెళియాపుట్టి: విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంపీడీఓ ఎన్‌.పి.పండా అన్నారు. మెళియాపుట్టి మండల పరిషత్‌ ఏవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రాజేశ్వరమ్మను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎస్‌.మోహనరావు, బైపోతు ఉదయ్‌కుమార్‌, ఎన్‌.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

వార్షిక కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ

ఎచ్చెర్ల : సెర్ప్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని 19 మండలాల వార్షిక కార్యాచరణ ప్రణాళికపై లావేరు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ బడిఈడు పిల్లలను బడికి పంపించడం, మహిళల అక్షరాస్యత, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, భూసార పరీక్షలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణ డీపీఎం మోహనరావు, ఏపీఎం భాగ్యలత, ఎల్‌సీ బసవరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు డైరీల వితరణ

కంచిలి: మండలంలోని పురుషోత్తపురం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 75 మంది విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన జయంతి నాగేశ్వరరావు దంపతులు డైరీలను వితరణగా ఇచ్చారు. వీటిని పాఠశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎస్‌.శివరాంప్రసాద్‌ చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ చాణక్య, పాఠశాల హెచ్‌ఎం సింహభట్ల శారద, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ బొట్ట గీత, ఉపాధ్యాయులు నల్లాన రవి, భార్గవి, సీఆర్‌ఎంటీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సహచర విద్యార్థుల ఆపన్నహస్తం

కవిటి: మండలంలోని రాజపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సాయం ప్రశంసనీయమైనదని శ్రీ శయన కుల సంఘం పెద్దలు అన్నారు. రాజపురం బాలుర ఉన్నత పాఠశాలలో 1998లో పదో తరగతి చదువుకున్న ఆనింగి లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి తనతో పాటు చదువుకున్న విద్యార్థులు విరాళంగా సేకరించిన రూ.50 వేల నగదుతో పాటు మృతుడి కుమార్తె చదువు కోసం రూ.2,000లు అలాగే నిత్యావసర సరుకులు మంగళవారం అందజేసి ఔదార్యం చాటుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement