● వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తే కారణం
శ్రీకాకుళం క్రైమ్ : మద్యం మత్తులో ఉన్న లగేజీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ముగ్గురి గాయాలకు కారణమయ్యాడు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం మండలం రాయిపాడుకు చెందిన వృద్ధుడు యట్రాజుల తవుడు ఏఎస్‌ఎన్‌కాలనీలో నిర్మిస్తున్న ఓ ఇంటికి తాపీ పనికి మంగళవారం ఉదయం వెళ్లాడు.. మధ్యాహ్నం బలగ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తమ గ్రామానికి చెందిన ఫంక్షన్ జరుగుతుండటంతో భోజనానికని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్తరోడ్డు నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వైపు వస్తున్న లగేజీ వ్యాను డ్రైవర్ నారు మురళి (ఆమదాలవలస మండలం దూసి) మద్యం మత్తులో వృద్ధుడిని ఢీకొట్టాడు. అంతేకాక కాంప్లెక్సు వైపు స్కూటీపై వెళ్తున్న దంపతులు సాధు గణేష్, మాధవిలను ఢీకొట్టాడు. అందరూ గాయపడటంతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.
పీఎన్ కాలనీలో..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పీఎన్‌కాలనీలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ మహిళ గాయపడింది. ట్రాఫిక్ ఏఎస్‌ఐ మెట్ట సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీఎన్‌కాలనీలో కర్రి స్వాతి తన భర్త సంతోష్‌కుమార్‌తో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో తన బంధువైన ఉదయ్‌కుమార్‌తో నవభారత్ జంక్షన్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లావేరుకు చెందిన ప్రగఢ గోపి తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. మహిళకు గాయాలవ్వడంతో కేసు నమోదు చేశామని చెప్పారు.
దంపతులకు గాయాలు
రణస్థలం: లావేరు మండలం బొంతుపేట జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్న దంపతులు నడుపూరి సురేష్, రాజకుమారిలకు బొలెరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం తరలించారు. లావేరుకు చెందిన సురేష్ బైక్‌పై శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని 108 సిబ్బంది ఈశ్వరరావు, చిన్నా తెలిపారు. లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


