శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో వెనుకబడిన బీఎల్‌ఓలు పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలు మాత్రమే స్వయంగా పంపిణీ చేసి తిరిగి వారే సేకరించాలని స్పష్టం చేశారు. ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ఫారాల డిజిటలైజేషన్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక సహాయకుడిని, ఓటర్లను గుర్తించడంలో తోడ్పాటునందించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగవావాడీ సిబ్బందిని ప్రతి బీఎల్‌ఓకు సహాయకులుగా కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఏసీపీ జానకి తదితరులు పాల్గొన్నారు.


