గార: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది శ్రీకూర్మం పంచాయతీ వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మణరావు (46) గత కొన్నేళ్లు గా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం చెరువులో పడి చనిపోతానని చెప్పి బయటకు వెళ్లడంతో గ్రామస్తులు వెతికి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని సత్రం వద్ద భద్రం పంతులు మేడ మీద మునగ చెట్టు కు తన తువ్వాలుతో ఉరివేసుకున్నాడు. పనిమనిషి మేడమీదకు వెళ్లే సమయంలో చూసి కు టుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. భార్య సుమంగళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీహెచ్. గంగరాజు తెలిపారు.
జి.సిగడాం: కప్ప..కప్ప నీలాలు, కండవ నిండా వర్షాలు, కురవాలి వానదేవుడా, వానమ్మ వానమ్మా ఒక్క సారి వచ్చిపోవమ్మా.. రైతుల కష్టాలు తీర్చేవా రావమ్మా.. అంటూ మండల పరిధిలోని వెలగాడ, గొలుసుపూడిపేట గ్రా మాల్లో రైతులు, యువకులు, విద్యావంతులు కప్పయాత్ర చేశారు. కప్పను కావిడిలో ఊరేగిస్తూ ఇంటింటికి తీసుకువెళ్లి పసుపు, కుంకుమ, బిందెలతో నీరు తెచ్చి పూజలు చేశారు.
పాతపట్నం: తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో నిందితుడికి సోంపేట 6వ అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు పాతపట్నం సీఐ ఎన్.సన్యాసినాయుడు మీడియాకు సోమవా రం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాపు గోపాలపురం గ్రామానికి చెందిన బూసి శ్రీనివాసరావు పాతపట్నం సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో తన తల్లిదండ్రులైన బూసి రామారావు, తల్లి బూసి భగవతమ్మలు తరచూ జోక్యం చేసుకుంటూ, తన భార్య కల్యాణికి వత్తాసు పలుకుతున్నారనే ఆగ్రహంతో 2022 సంవత్సరం జూన్ 7వ తేదీ అర్ధరాత్రి కాపుగోపాలపురంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారిని హతమార్చాడు. మృతుల కోడలు బూసి బృందారణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ ఎం.వినోద్‌బాబు కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.జగన్నాయకులు వాదనలు వినిపించారు. నిందితుడిపై అభియోగాలు రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, అదనంగా రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలలు సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తెలిపారని సీఐ తెలిజేశారు.
రణస్థలం: మండలంలోని జేఆర్‌పురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస బైక్ చోరీల దొంగలను జేఆర్‌పురం సర్కిల్ పరిధి పోలీసులు పట్టుకున్నారని జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రణస్థలం పరిధిలో 6 ద్విచక్ర వాహనాలు, లావేరులో 1, జి.సిగడాంలో 1 మొత్తం 8 ద్విచక్ర వాహనాలు, లావేరులో ఒక వ్యవసాయ మోటారు ఇటీవల కాలంలో దొంగిలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. జే.ఆర్.పురం, సీతంవలస పరిధిలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అయితే వారిలో ముగ్గురు మైనర్లు కాగా.. ఒక వ్యక్తి లావేరు మండలంలోని బుడతవలస గ్రామానికి చెందిన కుప్పిలి హరిగా పేర్కొన్నారు. మైనర్లులంతా లావేరు మండలంలోని ఒక గ్రామానికి చెందినవారే. అలాగే ఈ బైకులు కొనుగోలు చేసిన ఇనుప తుక్కు దుకాణం నిర్వాహకుడు అదపాక గ్రామానికి చెందిన బెజ్జిపురపు వెంకట నాయుడును ఆరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి ఐదు బైకులు, ఒక వ్యవసాయ మోటారు రికవరీ చేశారు. మిగతా మూడు బైకులు తుక్కుకు అమ్మేశారు. సమావేశంలో జేఆర్‌పురం, లావేరు, జి.సిగడాం ఎస్‌లు ఎస్.చిరంజీవి, కె.అప్పలసూరి, సందీప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె.కిరణ్ కుమార్, ఎం.జోగారావు, లావేరు కానిస్టేబుల్ లక్ష్మణరావు, హేమంత్, ఎచ్చెర్ల కానిస్టేబుల్ రవి కుమార్ తదితరులు ఉన్నారు.


