రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని బెల్‌హర్‌కు చెందిన ఓ సంస్థ సాంకేతిక గూడ్స్, యూరియా సరఫరాదారులమని నమ్మబలికి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి రూ.7.02 లక్షలను కొల్పొయింది. ఆన్‌లైన్ వేదిక ద్వారా జరిగిన ఈ మోసంపై సంస్థ ఫిర్యాదు చేయడంతో ఝార్సుగుడ సైబర్ పోలీసులు వెంటనే స్పందించారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి ) ద్వారా తక్షణ చర్యలు చేపట్టి, సంబంధిత బ్యాంకులతో సమన్వయం సాధించారు. మోసగాళ్ల ఖాతాల్లోకి వెల్లిన మొత్తం నగదును స్తంభింపజేసి 100 శాతం మొత్తాన్ని బాధిత సంస్థకు విజయవంతంగా తిరిగి అందజేశారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాఘవేంద్ర మాట్లాడుతూ వ్యాపార సంస్థలు, ప్రజలు ఆన్‌లైన్‌లో సరఫరాదారుల వివరాలను పూర్తిగా ధృవీకరించిన తరువాత ముందస్తు చెల్లింపులు చేయాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. వేగంగా ఫిర్యాదు చేస్తేనే మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.


