ముగిసిన వేంకటేశ్వర స్వామి
● ఆకట్టుకున్న ప్రధాన ఘట్టాలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరంలో ఈ నెల 24వ తేదీన నుంచి ప్రారంభమైన మందిరం వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో అత్యంత ఘనంగా ముగిశాయి. చక్రస్నానం, విశ్వక్షేణ పూజలు, కొట్నాల దంచడం వంటి విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మందిరం ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ముగింపు ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యులతో పాటు వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య విశ్వక్షేణ పూజలను నిర్వహించారు. మందిరం ఉత్సవాలకు విఘ్నాలు తొలగి సక్రమంగా పూర్యయ్యాయని సూచించే ఈ పూజలను అత్యంత శాస్ట్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కొట్నాలు దంచడం కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ధ్వజారోహణం, ఉంజల్‌సేవ, శ్రీనివాస కల్యాణం, సుదర్శన హోమం, వివిధ వాహనాల సేవలు, ప్రత్యేక పూజలు విజయవంతంగా నిర్వహించినట్టు మందిర పరిచాలన కమిటీ అధ్యక్షులు చంద్రమౌళి కుముంధాన్, కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్‌లు వెల్లడించారు. చివరి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. బ్రహ్మ్మోత్సవాల విజయవంతంగా నిర్వహిచిన మందిర కమిటీ సభ్యులు, అర్చకులు, సేవాదారులు, దాతలు, భక్తులు అందించిన సహాకారాన్ని పరిచాలన కమిటీ అభినందించింది.గోవిందా.. గోవిందా నామస్మరణాల మధ్య స్వామివారికి వీడ్కోలు పలికారు.


