రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాలోని బిసంకటక్ సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 100 వినతులను ఆయన స్వీకరించారు. స్వీకరించిన వినతుల్లో 84 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 14 గ్రామ సమస్యలు కాగా మరో ఇద్దరికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్వీకరించిన గ్రామసమస్యల్లో అవాస్ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల పట్టాలు, రహదారుల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాల ఏర్పాటు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలొ గునుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లీప్, జిల్లా ముఖ్యవైద్యాఽధికారి డాక్టర్ నాగేంద్ర నాథ్ మహాపాత్రో, అటవీశాఖ అధికారి అన్నాసాహెబ్ అహాలే పాల్గొన్నారు.


