మద్యానికి మరొకటి.. | - | Sakshi
Sakshi News home page

మద్యానికి మరొకటి..

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

మద్యానికి మరొకటి.. ఇంత నిర్లక్ష్యమా..

ఒంటి మీద వస్త్రం నిలవనంత మత్తు..

ఎదురుగా వాహనం కనిపించనంత నిషా..

ఎంత ఘోరం జరిగిందో గుర్తు పట్టలేనంత మైకం..

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలికొంది. డ్రైవర్‌ నెత్తికెక్కిన మత్తు, అతివేగానికి ఫలితంగా మూడు కుటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి. పొద్దున్నే సామాన్లు కొని సాయంత్రానికి అమ్మేసి ఇంటికి వెళ్లిపోదామనుకున్న ఆడ పడుచుల ప్రయాణం నడిరోడ్డుపైనే ఆగిపోయింది. కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్‌ సమీపంలో లగేజీ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు.

నుజ్జునుజ్జు అయిన ఆటో

కవిటి:

ద్దానం ప్రాంతంలో పండే కొబ్బరి కాయ లు, పనస పండ్లు, అరటికాయలు, మునగ వంటి ఉత్పత్తుల్ని ఇక్కడ కొనుగోలు చేసి వాటిని బరంపురం మార్కెట్‌లకు తీసుకెళ్లి అమ్ముకోవడం వారికి జీవనోపాధి. అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ ఆదివారం కూడా సరుకులు కొనడానికి ఇంటి నుంచి బయల్దేరారు. సాయంత్రానికి అన్నీ అమ్మేసి ఇంటికి వచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఆ ముగ్గురు మహిళలకు ఇదే చివరి రోజైంది. మద్యం మత్తులో లారీని నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపిన ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం వారి జీవితాల్ని గాలిలో కలిపేసింది. కంచిలి మండలం ఆదివారం సంత నుంచి లగేజీ ఆటోలో వెళుతున్న ముగ్గురు మహిళలు కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్‌ సమీపంలో 16 వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కవిటి మండలం గుజ్జుపుట్టుగకు చెందిన మురపాల పార్వతి(50), రాపాకపుట్టుగ కు చెందిన నర్తు పద్మమ్మ (60), ఇచ్ఛాపురం పట్టణం అమీన్‌సాహేబ్‌పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52)తో పాటు మరికొందరు మఖరాంపురం జంక్షన్‌ వద్ద సంతకు వెళ్లేందుకు ఆదివారం లగేజీ ఆటోపై బయల్దేరారు. మఖరాంపురం జంక్షన్‌లో సరుకు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యా రు. సరిగ్గా జమేదారుపుట్టుగ జంక్షన్‌కు వచ్చేసరికి ఆటోను రోడ్డు పక్కగా నిలిపారు. అయితే అదే సమయానికి వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ ఈ ఆటో ను అమాంతం ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకుపో యి విద్యుత్‌ స్తంభానికి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వారిలో రాపాకపుట్టుగకు చెందిన నర్తు ఎర్రయ్య, బరంపురానికి చెందిన బొడ్డు కేశవులు, రాపాకపుట్టుగకు చెందిన మామిడి మోహినమ్మ, కామాక్షి ఉన్నారు. వీరిలో మోహినమ్మ, కామాక్షి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించామని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. లారీ డ్రైవర్‌ పరిస్థితి చూసి అందరూ విస్మయం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్‌ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ఒంటిపై తువ్వాలు నిలవడం లేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆయా కుటుంబాల వారికి విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తమకు అన్నం పెట్టే చేతులు ఇక లేవని కన్నీరుమున్నీరయ్యారు. మృతుల్లో నర్తు పద్మమ్మకు భర్త బాబయ్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మురపాల పార్వతికి భర్త ఢిల్లీరావు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మద్దిలి తరిణమ్మకు భర్త దాలయ్య, కొడుకు, కూతురు ఉన్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం రూరల్‌ ఎస్‌ఐ జనార్ధనరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ భంజారౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కడియాల ప్రకాష్‌ వెళ్లి పరామర్శించారు.

జమేదారుపుట్టుగ జంక్షన్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు మహిళల దుర్మరణం

నలుగురికి గాయాలు

మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement