కొరాపుట్: మినీ ట్రక్కు ఢీకొని బాలిక మృతి చెందిన విషాధకర ఘటన జరిగింది. ఆది వారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పాత బస్టాండ్ వద్ద జొరిగాం సమితి డొంగ్రిగుడ గ్రామానికి చెందిన మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి రోడ్డుపై నడుస్తుంది. ఇంతలో మినీ ట్రక్కు వేగంగా వచ్చి బాలికని ఢీ కొంది. గాయాలపాలైన బాలికను ఓ ఆటో డ్రైవర్ వెంటనే తన ఆటోలో ఉమ్మర్‌కోట్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రక్కు డైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
రాయగడ: బనహార్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైన కేవలం 367 రోజుల్లొనే న్యాయ స్థానం తీర్పును వెలువరించి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జిల్లా ఎస్పీ జిఆర్ రాఘవేంద్ర పర్యవేక్షణలో బనహార్‌పల్లి పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించారు. దీంతో కేసు ఏడాదిలోపే విచారణ పూర్తయ్యి నిందితుడికి శిక్ష ఖరారైంది. 2025 బనహార్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో నిందితుడు అజయ్ సింగ్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అభియోగాలు రుజువు కావడంతో కోర్టు అతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు రూ.50వేల జరిమానా విధించింది. బాధిత చిన్నారికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా రూ.8 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.
శ్రీముఖలింగంలో ఘనంగా మైనాకోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో ఆదివారం స్వామికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతి పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామివారి గృహాన్ని దహనం చేస్తాడు. కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయంగా పరగణిస్తారు.
పాలీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం
ఎచ్చెర్ల: ఏపీ పాలీసెట్–2026 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసినప్పుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వెబ్ ఆప్షన్లు నమోదు సమయంలో ఉపయోగించే మొబైల్ నంబర్ తప్పనిసరిగా అభ్యర్థి లేదా వారి తల్లిదండ్రు లది ఉండాలి. ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకసారి వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని తిరిగి మార్చడం, తెరవడం సాధ్యం కాదు. హెల్ప్‌లైన్ సెంటర్‌లో కూడా ఓపెన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని ఆప్షన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్ర మే ఫ్రీజ్ చేయాలి. వెబ్ ఆప్షన్లు నమోదు చేయ డానికి ముందు కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో ఒక కాగితంపై ముందుగా రాసుకుని అనంతరం అదే క్రమంలో వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌లో మార్పు అవసరమైతే అభ్యర్థి సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి సెట్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలి.
పునరావాస కాలనీలో పనులు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం పునరావాస కాలనీలో పంచాయతీ అధికారులు పనులు చేపట్టారు. ‘ఎవరికి చెప్పినా ఏం లాభం’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. సెలవు రోజు అయినా పనులను చేపట్టారు. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామానికి వెలుతురు తెచ్చారు. నిల్వ ఉన్న మురికినీటిని మళ్లించారు. గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పునరావాస కాలనీలో 13 సెంట్లు కేటాయించామని తహసీల్దార్ హేమసుందర్‌రావు తెలిపారు.


