జర్నలిస్టులకు ఉచిత వైద్య సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు ఉచిత వైద్య సౌకర్యం

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పించడంతోపాటు వారి పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు అందిస్తానని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అన్నారు. ఉత్కళ జర్నలిస్టుల సంఘం వార్షిక ఉత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. వార్షికోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ సహాయ్‌ మీనా, సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి రాకేష్‌ కుమార్‌ సాహు తదితరులు విచ్చేశారు. ఉత్కళ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ద్విజేంద్రనాథ్‌ పాడీ అధ్యక్షత వహించారు. వార్షిక పట్టికను కార్యదర్శి సరోజ్‌ బీర్‌ చదివి వినిపించారు. గౌరవ అతిథిగా హాజరైన ప్రగతివాది ఒడియా పత్రిక ముఖ్యసంపాదకులు విరూపాక్ష త్రిపాఠి మాట్లాడుతూ.. వర్కింగ్‌ జర్నలిస్టులకు నెలసరి పింఛన్‌, అక్రిడియేషన్‌, భద్రత, మృతిచెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. దీనిపై నవంబర్‌లో ఒడిశా అసెంబ్లీ ఎదుట ఆందోళన జరుపుతామన్నారు. గజపతి జిల్లాలో చాలా రోజుల తరువాత ఎస్‌.డి.పి.ఓ రాకేష్‌ కుమార్‌ సాహు (ఆర్‌.ఉదయగిరి) ఐ.పి.ఎస్‌ అధికారి బాధ్యతలు చేపట్టిన తరువాత గంజాయి అక్రమ రవాణాను అరికట్టి అనేక మందిని అదుపులోకి తీసుకున్నారని ఉత్కళ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ద్విజేంద్ర నాథ్‌ పాడీ అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం రాకేష్‌ కుమార్‌ సాహును ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్‌.డి.పి.ఓ రాకేష్‌ కుమార్‌ సాహు మాట్లాడుతూ..గజపతి జిల్లాకు తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గంజాయి అక్రమ రవాణాను ఎలా అరికట్టాలి, గజపతి అంటే గంజాయి జిల్లా అనే అపవాదును ఎలా రూపుమాపాలన్న అంశంతో పనిచేశానన్నారు. త్వరలోనే గజపతి జిల్లా ప్రజలకు శుభవార్త చెబుతానన్నారు. అనంతరం కొత్తగా ఉత్కళ జర్నలిస్టుల సంఘంలో చేరిన సభ్యులకు ఐడీ కార్డులను ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement