రాయగడ: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకుని విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ద్యమీ ఒడిశా అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమం స్థానిక గొవింద చంద్ర దేవ్ ఉన్నతపాఠశాల మైదానంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒడిశా గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ దేవేష్ రంజన్ ధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుందని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ముఖ్యవక్తగా సీనియర్ పరిశ్రమల అధికారి సవ్యసాచి సాహు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ రంగం పాత్రను వివరించారు.


